IND vs SA : ఇటీవల టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమదే: గావస్కర్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓటమిపై మాజీ కెప్టెన్, క్రికెట్‌ దిగ్గజం...

Published : 22 Jan 2022 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓటమిపై మాజీ కెప్టెన్, క్రికెట్‌ దిగ్గజం సునిల్ గావస్కర్‌ స్పందిస్తూ.. భారత తుది జట్టు కూర్పులోనే భారీ లోటు కనిపించిందని పేర్కొన్నాడు. ఇవాళ పార్ల్‌ వేదికగా రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ప్రదర్శనపై ఓ ఛానెల్‌తో గావస్కర్ మాట్లాడాడు. మూడు వన్డేల సిరీస్‌ అయిపోయేంత వరకు వేచి చూడాలని అభిమానులను కోరాడు. అంతవరకు ఓపికగా ఉండాలని, జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించాడు. ఇదే సందర్భంలో తుది జట్టులో ఓ లోపం కనిపిస్తోందని, అదే టీమ్‌ను బ్యాలెన్స్‌ లేకుండా చేసిందని తెలిపాడు. వెంకటేశ్ అయ్యర్‌తో బౌలింగ్‌ చేయించాల్సిందిగా పేర్కొన్నాడు.

జట్టులో సమతూకంపై అడిగిన ప్రశ్నకు గావస్కర్ సమాధానం ఇచ్చాడు. ‘‘ఇటీవల కాలంలో తెల్ల బంతి క్రికెట్‌కు సంబంధించిన ఐసీసీ టోర్నమెంట్లలో ఒకే కారణంతో భారత్‌ నిరాశపరిచింది. ఒకసారి 1983, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ విజయాలను పరిశీలించండి. అప్పుడు జట్టులో అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. అందుకే టైటిళ్లను కైవసం చేసుకోగలిగాం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ చేయగలిగే సమర్థులు ఉండేవారు. ఆరు నుంచి ఎనిమిదో స్థానం వరకు ఆల్‌రౌండర్ల అవసరం ఎంతైనా ఉంది. యువరాజ్‌, సురేశ్‌ రైనా వంటి వారినే ఉదాహరణగా తీసుకుంటే రెండు విభాగాల్లోనూ రాణించారు. ఇదే గత రెండు మూడేళ్లుగా టీమ్‌ఇండియాలో లోపించింది. అంతేకాకుండా సారథికి ఆప్షన్లు లేవు.. ఆటగాళ్ల ఎంపికకు వెసులుబాటు లేకుండాపోయింది. అంతేకాకుండా వెంకటేశ్ అయ్యర్‌తో కేఎల్‌ రాహుల్‌ ఎందుకు బౌలింగ్‌ చేయించలేదో అర్థం కాలేదు’’ అని గావస్కర్ విశ్లేషించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని