Axar Patel : బేసిక్స్‌కు కట్టుబడ్డా.. ఫలితం సాధించా: అక్షర్‌ పటేల్

 కాన్పూర్‌ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆధిక్యం సాధించడంలో...

Published : 28 Nov 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాన్పూర్‌ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆధిక్యం సాధించడంలో అక్షర్‌ పటేల్‌ (5/62) కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను 296 పరుగులకే టీమ్‌ఇండియా కట్టడి చేయగలిగింది. ఈ సందర్భంగా తన ప్రదర్శనపై అక్షర్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘ఆరంభం ఈ విధంగా ఉండాలని భావించా. టెస్టు క్రికెట్‌ అంత సులభం కాదు. ఇవాళ చాలా కష్టమైన రోజు. ఎందుకంటే నిన్న కివీస్‌ ఎలాంటి వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ప్రారంభించింది. అప్పటికే ఓపెనర్లు క్రీజ్‌లో కుదురుకుని పోయారు. ఇలాంటి సందర్భంలో ప్రతి బంతికి వికెట్‌ తీద్దామని కాకుండా ఓపిగ్గా బౌలింగ్ చేయాలని జట్టు సభ్యులం మాట్లాడుకున్నాం. నా బేసిక్స్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేశా. అంతేకాకుండా క్రీజ్‌ను కూడా అనుకూలంగా మార్చుకుని  ఉపయోగించుకోవడంతో వికెట్లు దక్కాయి. ట్రాక్‌ ఎంతో నెమ్మదించింది. ఇవాళ టర్న్‌ అవుతోంది. అప్పుడప్పుడు బౌన్స్‌ కూడా  అవుతోంది. దాన్ని వినియోగించుకుని రౌండ్‌ ఆర్మ్‌ డెలివరీలు సంధించా. అయితే క్రీజ్‌లో బ్యాటర్లు కుదురుకుంటే మాత్రం పరుగులు వస్తాయని ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని అక్షర్‌ పేర్కొన్నాడు. 

కీపింగ్‌లో చురుగ్గా వ్యవహరించిన భరత్‌

వృద్ధిమాన్‌ సాహా స్థానంలో కీపింగ్‌కు వచ్చిన కేఎస్ భరత్‌ తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. కివీస్‌ ఓపెనర్లు లేథమ్‌ (95), విల్‌ యంగ్ (89), రాస్‌ టేలర్‌ (11) ఔట్‌లో భరత్‌ కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా అశ్విన్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌ క్యాచ్‌ను అందుకున్న భరత్‌.. టీమ్‌ఇండియా అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. అశ్విన్‌ బంతిని కట్‌ చేయబోయిన విల్‌ యంగ్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుంది. అయితే అంపైర్‌ నాటౌట్‌ ప్రకటించాడు. వెంటనే కీపర్‌ భరత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లాలని కెప్టెన్‌ రహానె, బౌలర్‌ అశ్విన్‌కు సూచించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన భారత్‌కు పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. విల్‌ యంగ్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకున్నట్లు తేలడంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అలానే సెంచరీకి చేరువైన లేథమ్‌ను భరత్‌ స్టంప్‌ ఔట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని