T20 World Cup 2021: శతక్కొట్టిన బట్లర్‌.. శ్రీలంక లక్ష్యం 164

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా సాగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్‌..

Updated : 01 Nov 2021 21:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ (101*) శతకంతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినప్పటికీ.. చివర్లో చేతులెత్తేశారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ మూడు, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. పవర్‌ ప్లే పూర్తయ్యేలోపు 36 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వనిందు హసరంగ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (9) బౌల్డయ్యాడు. ఐదో ఓవర్లో డేవిడ్‌ మలన్‌ (6) బౌల్డ్ కాగా.. ఆరో ఓవర్లో జానీ బెయిర్‌ స్టో (0) డకౌటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌తో కలిసి జోస్ బట్లర్‌ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టాడు. ఈ క్రమంలోనే 14వ ఓవర్లో బట్లర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ వేగం పెంచారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దూకుడుగా ఆడే క్రమంలో హసరంగ వేసిన 19వ ఓవర్లో మోర్గాన్ (40) ఔటయ్యాడు. ఆఖరి ఓవర్‌ చివరి బంతికి బట్లర్ సిక్స్‌ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. మొయిన్‌ అలీ (1) నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో శ్రీలంక బౌలర్లు పట్టు సడలించడంతో.. ఆ అవకాశాన్ని ఇంగ్లాండ్‌ బ్యాటర్లు సద్వినియోగం చేసుకుని భారీగా పరుగులు రాబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని