T20 World Cup 2007: ఫైనల్‌ పోరు.. చివరి ఓవర్‌ను జోగిందర్‌కు ధోనీ ఎందుకు ఇచ్చాడంటే?

టీ20 ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  తొలిసారి నిర్వహించిన ప్రపంచకప్‌ను భారత్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో సెప్టెంబర్‌ 24న.. ఇవాళ్టికి...

Published : 25 Sep 2022 01:28 IST

‘కెప్టెన్‌ కూల్‌’ నిర్ణయానికి కారణం చెప్పిన శ్రీశాంత్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  తొలిసారి నిర్వహించిన ప్రపంచకప్‌ను భారత్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో సెప్టెంబర్‌ 24న.. ఇవాళ్టికి 15 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో అప్పటి జట్టులో సభ్యులు తమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఓ క్రీడా ఛానెల్‌ నిర్వహించిన ‘07 ఛాంపియన్స్‌’ కార్యక్రమంలో శ్రీశాంత్, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను మీడియం పేసర్‌ జోగిందర్‌ శర్మకు ఎందుకు ఎంఎస్ ధోనీ బౌలింగ్‌ ఇచ్చాడో అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న.. తాజాగా ధోనీ నిర్ణయం వెనుక కారణం ఏంటనేది శ్రీశాంత్‌ తెలిపాడు. జోగిందర్‌ వేసిన బంతిని మిస్బా ఉల్ హక్‌ కొట్టగా.. ఫైన్‌ లెగ్‌సైడ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శ్రీశాంత్‌ చేతిలోనే పడింది. దీంతో భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. 

‘‘జోగిందర్ బాగా వేస్తాడని ధోనీ నమ్మాడు. అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాడు. నేను, ధోనీ, యువరాజ్‌, హర్భజన్‌ సింగ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు ఆడామని చాలా మందికి తెలియదు. జోగిందర్‌ శర్మ ఓఎన్‌జీసీ తరఫున ఆడేవాడు. మా జట్ల మధ్య దిల్లీలోనూ, బయట చాలా మ్యాచ్‌లు జరిగాయి. అందుకే జోగిందర్‌ సత్తా ఏంటో ధోనీకి తెలుసు. చాలాసార్లు జోగిందర్‌ ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌లను గెలిపించాడు. అందుకే అతడిపై అంత నమ్మకంతో కీలకమైన చివరి ఓవర్‌ను ఇచ్చాడు. ధోనీ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేయడానికి లేదు. అతడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో మ్యాచ్‌ ఫలితమే చెబుతుంది’’ అని శ్రీశాంత్‌ వివరించాడు. 

శ్రీశాంత్‌ పట్టింది క్యాచ్‌ కాదు.. ప్రపంచకప్‌: ఇర్ఫాన్‌

‘పాక్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో ఫైన్‌లెగ్‌లో ఉన్న శ్రీశాంత్‌ ఆ రోజు కేవలం క్యాచ్‌ను మాత్రమే పట్టుకోలేదు. భారత్‌కు వరల్డ్‌ కప్‌ను పట్టేశాడు. అప్పట్లో సోషల్‌ మీడియా లేదు. అయితే ప్రతి ఒక్కరూ పాకిస్థాన్‌పై గెలిచిన విషయం గురించే మాట్లాడుకొనేవారు. మేమంతా బిగ్‌ ఫైనల్‌లో తలపడ్డాం. అప్పుడు ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంది. తుదిపోరులో నా నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటాను పూర్తి చేసిన తర్వాత చాలా అలసిపోయా. నా కెరీర్‌లో ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు’’ అని ఇర్ఫాన్‌ చెప్పాడు. ఆ రోజు రోహిత్ శర్మ (30 పరుగులు: 16 బంతుల్లో) చాలా కీలకమైన పరుగులు చేశాడని, పాక్‌ ఎదుట మంచి స్కోరు ఉంచగలిగామని మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ గుర్తు చేశాడు. 

అది నాకింకా గుర్తే: రాబిన్‌ ఉతప్ప

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాబిన్‌ ఉతప్ప (50) పాకిస్థాన్‌పై గ్రూప్ దశలో అర్ధశతకం సాధించాడు. భారత్‌ తరఫున అతడే టాప్‌ స్కోరర్. ఈ మ్యాచ్‌లో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం బౌల్‌ అవుట్ నిర్వహించారు. అందులోనూ రాబిన్‌ ఉతప్ప వికెట్లను పడగొట్టి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘‘నాకు ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. మనం టీ20 ప్రపంచకప్‌ను నెగ్గి 15 ఏళ్లు అవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య కాలంలోనే జరిగినట్లు అనిపిస్తోంది. వరుసగా మూడు సార్లు బౌల్‌అవుట్‌ చేయడం ద్వారా మనం విజయం సాధించాం. మూడో బౌల్‌ అవుట్‌ను నేనే చేసి నా క్యాప్‌ను తీసి సంబరాలు చేసుకొన్న సంఘటన ఎప్పటికీ మరువలేను’’ అని రాబిన్‌ ఉతప్ప వివరించాడు. ప్రతి మ్యాచ్‌లో అవసరమైన పరిస్థితుల్లో కెప్టెన్ ధోనీ ఆటగాళ్ల సలహాలను, సూచనలను తీసుకొనేవాడని హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని