Virat- Ganguly: ఆ వార్తల్లో నిజంలేదు.. అర్థరహితం: సౌరభ్ గంగూలీ

టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని...

Published : 22 Jan 2022 10:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని తాను భావించినట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కొట్టిపడేశాడు. ఇలాంటివి అర్థరహితమైనవిగా పేర్కొన్నాడు. అందులో నిజం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ గతేడాది పొట్టి ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ టీ20తోపాటు వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించి రోహిత్‌ను నియమించింది. 

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో వన్డే కెప్టెన్సీ గురించి విరాట్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని, వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందే సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. దీంతో గంగూలీ ఒకానొక దశలో విరాట్‌ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడట. అయితే బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయం పెద్దది కాకుండా ఆపాడని మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించడంతో వివాదానికి ముగింపు పలికినట్లైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీకీ గుడ్‌బై చెప్పేశాడు. అయితే టెస్టు జట్టు సారథి ఎంపికపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని