ఇంగ్లాండ్ ఎలా కోలుకుంటుందో తెలియదు..! 

ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందని, ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటుందో తెలియదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు...

Published : 08 Mar 2021 01:15 IST

భారత్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది: అక్తర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ జట్టు భారతత్‌ లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందని, ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటుందో తెలియదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. తాజాగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌ 3-1 తేడాతో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోవడమే కాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్‌ ఛానెల్లో స్పందించిన అక్తర్‌ జోరూట్‌ జట్టును ఎండగట్టాడు.

‘మొత్తంగా ఇంగ్లాండ్‌ జట్టుకిది ఘోర పరాభవం. భారత్‌లో ఎలా ఆడాలనే విషయంపై ఇప్పుడా జట్టు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉప ఖండంలో స్పిన్‌ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్‌ చేయాలో కచ్చితంగా నేర్చుకోవాలి. భవిష్యత్‌లో బాగా ఆడేందుకు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు.. ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటారో, ఎలా ప్రేరణ చెందుతారో తెలియదు’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. అలాగే పలువురు ఇంగ్లాండ్‌ మాజీలు పిచ్‌ల గురించి విమర్శించిన నేపథ్యంలో పాక్‌ మాజీ పేసర్‌ స్పందించాడు.

‘ఈ సిరీస్‌లో కొంత మంది వికెట్ల గురించి మాట్లాడారు. కానీ టీమ్‌ఇండియా అదే పిచ్‌పై భారీ స్కోర్‌ ఎలా సాధించింది?ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు విఫలమైన వికెట్‌పైనే భారత ఆటగాళ్లు ఎలా ఆడారు? రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి యువ క్రికెటర్లు పరుగులు చేసినప్పుడు పర్యాటక జట్టు ఆటగాళ్లు ఎందుకు ఆడలేకపోయారు?టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ చిత్తు చేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన అక్షర్‌ పటేల్‌.. 3 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీయడం గొప్ప విశేషమని కొనియాడాడు. అతడో తెలివైన బౌలర్‌ అని, ఇలాంటివి మరికొన్ని ప్రదర్శనలు చేస్తే అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడని పాక్ మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని