అక్తర్‌ అడిగితే 2011 సెమీస్‌ టికెట్లు ఇప్పించా 

2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్‌ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. తనని సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ టికెట్లు అడిగాడని టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ గుర్తు చేసుకున్నాడు...

Published : 03 Apr 2021 12:16 IST

ఫైనల్‌ టికెట్లు కూడా అడిగాడు.. కానీ : హర్భజన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్‌ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. తనని సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ టికెట్లు అడిగాడని టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగి శుక్రవారంతో పదేళ్లు పూర్తయిన సందర్భంగా భజ్జీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు మొహాలి వేదికగా జరిగిన భారత్‌-పాకిస్థాన్ సెమీఫైనల్స్‌ మ్యాచ్‌కు ముందు అక్తర్‌ తనని సంప్రదించాడని చెప్పాడు.

‘‘2011 వన్డే ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్‌తో సెమీఫైనల్స్‌కు ముందు అక్తర్‌ నన్ను కలిశాడు. తొలుత ఆ మ్యాచ్‌కు కొన్ని టికెట్లు కావాలని కోరాడు. దానికి నేను నాలుగు టికెట్లు ఇప్పించా. తర్వాత ఫైనల్స్‌కు కూడా టికెట్లు కావాలన్నాడు. దాంతో నేను ఇలా అన్నాను.. ‘ఫైనల్స్‌ టికెట్లతో నువ్వేం చేస్తావు. అక్కడ ఆడేది టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ కాదు. ఒకవేళ నువ్వు వచ్చి వాంఖడేలో ఫైనల్స్‌ చూస్తానంటే 2-4 టికెట్లు ఇప్పించగలను’ అని చెప్పాను. అయితే, పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లోనూ అక్తర్‌ ఆడకపోవడం గమనార్హం’’ అని హర్భజన్‌ నాటి విశేషాలను గుర్తు చేసుకున్నాడు.

ఇక మొహాలి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీస్‌ పోరులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (85) రాణించడంతో టీమ్‌ఇండియా 260/9 స్కోర్‌ సాధించింది. తర్వాత పాకిస్థాన్‌ 231 పరుగులకు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆపై ముంబయిలోని వాంఖడేలో జరిగిన తుదిపోరులో శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గంభీర్‌(97), ధోనీ(91*) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక చివర్లో ధోనీ కొట్టిన సిక్స్‌తో టీమ్‌ఇండియా విజయం సాధించడం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో అలాగే నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని