WTC Final: బుమ్రా విషయంలో అజాగ్రత్త! 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఎంపిక విషయంలో టీమ్‌ఇండియా సెలెక్టర్లు మరింత దృష్టి సారించివుంటే బాగుండేదని మాజీ క్రికెటర్‌ సబా కరీం అన్నారు. పేరుచూసి తీసుకోవడం కన్నా ఇటీవలికాలంలో అతడి ఫామ్‌ చూడాల్సిందని అభిప్రాయపడ్డారు

Published : 27 Jun 2021 01:11 IST

భారత సెలెక్టర్లపై మాజీ క్రికెటర్‌ సబా కరీం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఎంపిక విషయంలో టీమ్‌ఇండియా సెలెక్టర్లు మరింత దృష్టి సారించివుంటే బాగుండేదని మాజీ క్రికెటర్‌ సబా కరీం అన్నారు. పేరుచూసి తీసుకోవడం కన్నా ఇటీవలికాలంలో అతడి ఫామ్‌ చూడాల్సిందని అభిప్రాయపడ్డారు. కివీస్‌తో జరిగిన ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో బుమ్రా 37 ఓవర్లు బౌలింగ్‌ చేసి, ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా వ్యాఖ్యానించారు.

‘బుమ్రా విషయంలో సెలెక్టర్లు సరైన దృష్టి పెట్టలేదని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అతడి ఫామ్‌ చూడకుండా కేవలం పేరు ప్రఖ్యాతులను చూసే తుది జట్టులోకి తీసుకొని ఉండొచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడు గాయపడ్డాక మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడలేదు. ఇంగ్లాండ్‌తోనూ టీ20 మ్యాచులే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఫామ్‌లో లేడని నాకు అనిపిస్తోంది. అయితే, ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా కొంతవరకు లయ అందుకున్నట్లు అనిపించింది. కొన్ని సందర్భాల్లో అతడిని దురదృష్టం కూడా వెంటాడింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో బుమ్రా అవసరమైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేకపోయాడు’ అని కరీం చెప్పుకొచ్చారు.

అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా గాయపడ్డాక మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడలేదని కరీం పేర్కొనడం నిజం కాదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అతడు రెండు మ్యాచులు ఆడాడు. తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన టీమ్‌ఇండియా పేసర్ మూడో టెస్టులో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అది స్పిన్‌ ఫ్రెండ్లీ పిచ్‌ కావడంతో అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ చెలరేగి ఇంగ్లాండ్‌ పనిపట్టారు. ఇదిలా ఉంటే ఆగస్టులో అదే ఇంగ్లాండ్‌తో ఆడే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు బుమ్రా బౌలింగ్‌పై దృష్టి సారించి, సరైన నిర్ణయం తీసుకోవాలని కరీం పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ఫామ్‌ ఆందోళనకరంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని