Womens IPL: మాక్కూడా ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుంది:  హర్మన్‌ప్రీత్‌

మహిళల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే జరుగుతుందనే...

Published : 24 Nov 2021 18:55 IST

బిగ్‌బాష్‌లీగ్‌లో టీమ్‌ఇండియా టీ20 జట్టు సారథి అరుదైన రికార్డు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే జరుగుతుందనే నమ్మకం ఉందని టీమ్ఇండియా ఉమెన్స్ టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. వరల్డ్‌ బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనేగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్మన్‌.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికై అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆమె భారత్‌ నుంచి తొలి మహిళా క్రికెటర్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 14 మ్యాచుల్లో 399 పరుగులు, 15 వికెట్లు తీసింది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. నేను సాధించిన వాటిలో ఇదొక పెద్ద అచీవ్‌మెంట్. మద్దతుగా నిలిచిన జట్టుకు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. జట్టు నా నుంచి ఏం కోరుకుందో దానిని అందివ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా’’ అని పేర్కొంది. బిగ్‌బాష్‌లో తన ప్రదర్శనతో భవిష్యత్తు తరాల భారత మహిళా క్రికెటర్లకు స్ఫూర్తి నింపుతానని, వారు కూడా ఇలాంటి టోర్నీల్లో పాల్గొంటారనే ఆశాభావాన్ని వ్య్తక్తం చేసింది. బిగ్‌బాష్‌తోపాటు ఇంగ్లాండ్‌లోని సూపర్‌లీగ్‌లో ఆడిన తొలి టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌ కావడం విశేషం.

పొట్టి ఫార్మాట్‌లో విశేష ఆదరణ పొందుతున్న లీగ్‌ల్లో ఐపీఎల్‌ ఒకటి. అయితే మహిళల కోసం పూర్తిస్థాయిలో ఐపీఎల్‌ నిర్వహించాలని చాలా కాలంగా పలువురు మహిళా క్రికెటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా ఉమెన్స్ ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంది. ‘‘మహిళల ఐపీఎల్‌ కోసం మేం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ప్రారంభమవుతుందని ఆశిస్తున్నా. మంచి ప్రదర్శన ఇవ్వడం వరకే మా చేతుల్లో ఉంది. మిగతా విషయాలన్నీ బీసీసీఐ, ఐపీఎల్‌ బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి’’ అని హర్మన్‌ వివరించింది. 

బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ గెలుపుల్లో హర్మన్‌ ముఖ్య భూమిక పోషించింది. స్వల్ప స్కోర్లు నమోదైన తొలి మ్యాచ్‌లోనే (హోబర్ట్‌ హరికేన్స్ జట్టుతో) నాటౌట్‌ నిలిచి కీలకమైన 24 పరుగులను చేయడంతో మెల్‌బోర్న్ విజయం సాధించింది. అటు బౌలింగ్‌లోనూ (1/20) మంచి ప్రదర్శనే ఇచ్చింది. 

* అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హర్మన్‌ (41) రాణించింది. ఇటు బౌలింగ్‌లోనూ (1/31) పర్వాలేదనిపించినా మెల్‌బోర్న్‌కు ఓటమి తప్పలేదు. 

* సిడ్నీస్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో (2/17) చెలరేగిన హర్మన్‌.. బ్యాటింగ్‌లోనూ (35 పరుగులు నాటౌట్) ఆఖరి ఉండి జట్టుకు విజయాన్ని అందించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది.  సిడ్నీ సిక్సర్స్ జట్టుతో మ్యాచ్‌లోనూ హర్మన్‌ (43) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. 

* మళ్లీ అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టేసింది. తొలుత బౌలింగ్‌లో (2/31)తో సత్తా చాటిన హర్మన్‌.. ఛేదనలోనూ దుమ్మురేపింది. కేవలం 46 బంతుల్లోనే 73 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 

* బ్రిస్బేన్‌ హీట్ జట్టుపైనా హర్మన్ (62) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్రిస్బేన్‌ కూడా లక్ష్య ఛేదన దిశగా సాగింది. ధాటిగా ఆడిన క్లార్క్‌ (ఆరు బంతుల్లో 15 పరుగులు)ను హర్మన్‌ప్రీత్‌ (1/19) ఔట్ చేయడంతో విజయం మెల్‌బోర్న్‌ను వరించింది. 

* మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో (3/22) అద్భుతమైన బౌలింగ్‌తో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్‌ 103 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెనెగేడ్స్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని (104 పరుగులు) ఛేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని