IPL 2021: చెలరేగిన కోహ్లీ సేన.. 111 పరుగులకే ముంబయి ఆలౌట్‌ 

 ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు 54 పరుగుల తేడాతో గెలిచింది.

Updated : 26 Sep 2021 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఇండియన్స్ ఈ అంచెలో వరుసగా మూడోసారి ఓటమిపాలైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 111 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆర్‌సీబీ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి ఆటగాళ్లలో రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించగా మిగతా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు, చాహల్‌ మూడు, మ్యాక్స్‌వెల్‌ రెండు, సిరాజ్‌ ఒక వికెట్ తీశారు. 

హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌..
తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (51; 42 బంతుల్లో 3×4, 3×6), మ్యాక్స్‌వెల్  (56; 37 బంతుల్లో 6×4, 6×3) రాణించారు. 166 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబయికి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి రెండు ఓవర్లు కాస్త నెమ్మదిగా ఆడిన ముంబయి ఆటగాళ్లు తర్వాత జోరు పెంచారు. జేమీసన్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. తర్వాత డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన డికాక్‌ (24) చాహల్‌ వేసిన ఏడో ఓవర్లో మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన 10వ ఓవర్‌లో చివరి బంతికి రోహిత్‌.. పడిక్కల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌(9), కృనాల్‌ పాండ్య (5), సూర్యకుమార్‌ యాదవ్‌(8) కుడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక 17వ ఓవర్లో హర్షల్‌ పటేల్‌ అద్భుతమే చేశాడు. హార్దిక్‌ పాండ్య(3), కీరన్‌ పొలార్డ్ (7), రాహుల్‌ చాహర్‌(0)లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ తీశాడు. చాహల్‌ వేసిన 18 ఓవర్‌లో బుమ్రా(5) పెవిలియన్ చేరగా.. హర్షల్‌ పటేల్ వేసిన 18.1 బంతికి మిల్నే(0) ఔటవడంతో ముంబయి 111 పరుగులకు ఆలౌటైంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని