Ramiz Raja: న్యూజిలాండ్‌ది ఏకపక్ష నిర్ణయం: రమీజ్ రజా

పాకిస్థాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేస్తూ న్యూజిలాండ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ) నూతన ఛైర్మన్‌ రమీజ్‌ రజా విమర్శించాడు. దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆటగాళ్లకు..

Published : 17 Sep 2021 23:25 IST

రావల్పిండి: పాకిస్థాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేస్తూ న్యూజిలాండ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ) నూతన ఛైర్మన్‌ రమీజ్‌ రజా విమర్శించాడు. దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా న్యూజిలాండ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని అన్నాడు. ‘ఇది చాలా బాధాకరమైన రోజు. న్యూజిలాండ్ నిర్ణయంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లు, అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆటగాళ్ల భద్రత గురించి కనీసం మాతో చర్చించకుండా న్యూజిలాండ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అది మమ్మల్ని అసహనానికి గురి చేసింది. న్యూజిలాండ్‌ ఏ ప్రపంచంలో జీవిస్తోంది? ఈ నిర్ణయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం’ అని రమీజ్‌ రజా ట్వీట్‌ చేశాడు.

 ‘పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ), పాకిస్థాన్‌ ప్రభుత్వం విదేశీ ఆటగాళ్ల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. న్యూజిలాండ్‌ పర్యటన కోసం కూడా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. మరోవైపు, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్‌తో వ్యక్తిగతంగా  మాట్లాడి.. ఆటగాళ్ల భద్రతపై హామీ ఇచ్చినా ప్రయోజనం  లేకపోయింది’ అని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ ఆరంభ సమయానికి ఇరు జట్లు మైదానానికి చేరుకోలేదు. దీంతో సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ అధికార వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2003లో కూడా న్యూజిలాండ్‌ ఇదే విధంగా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని