ఆ ముగ్గురి కాంబినేషన్‌.. కొత్త శిఖరాలకు భారత క్రికెట్‌: హర్భజన్‌

భారత ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకత్వంలో సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ భారత క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి ...

Published : 25 Nov 2021 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకత్వంలో సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం వల్ల జట్టులోని ఆటగాళ్లకు భరోసా, స్థిరత్వం వస్తుందని పేర్కొన్నాడు. ‘‘ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. రాహుల్‌ రావడంతో ఆటగాళ్లకు వారి ప్రదర్శనపై నమ్మకం కలుగుతుంది. జట్టులో స్థానంపై భరోసా ఉంటుంది. యువకులకు మంచి అవకాశాలు వస్తాయి. ఎలాంటి అన్యాయం జరగదు. అకారణంగా జట్టు నుంచి మిమ్మల్ని (క్రికెటర్లనుద్దేశించి) తప్పించరు. చాలా అవకాశాలను కల్పించేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తాడు. జట్టులో స్థిరత్వం తీసుకొస్తాడు’’ అని వివరించాడు. 

కొత్త కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కుదురుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చని హర్భజన్‌ అంచనా వేశాడు. అలాగే ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించడంపై మాజీ బ్యాటర్‌ ఆకాశ్‌ చోప్రా మేనేజ్‌మెంట్‌ను అభినందించాడు. రాహుల్‌ ద్రవిడ్‌కి కోహ్లీ గౌరవం ఇస్తాడని, తనకు కూడా కావాలని విరాట్ డిమాండ్‌ చేయడని పేర్కొన్నాడు. ‘‘క్రికెటర్‌గా భారత జట్టుకు ఏం చేశాడు.. వ్యక్తిగతంగా ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాడనేదే రాహుల్‌లో కోహ్లీ చూస్తాడు. టెస్టు మ్యాచ్‌లకు వస్తే రాహుల్‌ హృదయం దగ్గరగా ఉండే ఫార్మాట్‌ ఇదే. ఈ విషయం కోహ్లీకి కూడా తెలుసు. చాలా మ్యాచ్‌ల సందర్భంగా చెప్పాడు’’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు అందుబాటులో ఉండని కోహ్లీ స్థానంలో రహానె సారథ్యం వహిస్తాడు. 

పిచ్‌ ఎలా ఉండనుందంటే?

భారత్‌, కివీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరిగే కాన్పూర్‌ స్టేడియం సిద్ధమైపోయింది. అనువైన పిచ్‌ను తయారు చేయాలని భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సారథి అజింక్య రహానె నుంచి ఎలాంటి సూచనలు అందలేదని క్యూరేటర్‌ శివకుమార్‌ వెల్లడించారు. ఉత్తమమైన పిచ్‌ను రూపొందించామని పేర్కొన్నాడు. నవంబర్‌ నెలలో పిచ్‌ మీద కొంత తేమ ఉంటుందని, అయితే ట్రాక్‌ దృఢంగా ఉండి పగుళ్లు రావని మాత్రం చెప్పగలనని తెలిపాడు. ఆతిథ్యం దేశం జట్టు తమకు అనువుగా ఉండే పిచ్‌లను తయారు చేయించుకుంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కేవలం మూడు రోజులకే మ్యాచ్‌లు ముగుస్తున్న సంఘటనలను చూస్తున్నామని, ఇక్కడ మాత్రం అలా జరగదని గ్యారంటీ ఇచ్చాడు. అయితే రెండో రోజు నుంచి కాస్త బంతి టర్న్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్యూరేటర్‌ శివకుమార్‌ వివరించారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని