Pujara: పుజారాపై జాత్యహంకార వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన బౌలర్‌

ఒక వైపు జాత్యహంకార (రేసిజం) వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లోనూ...

Published : 19 Nov 2021 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వైపు జాత్యహంకార (రేసిజం) వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లోనూ రేసిజం సెగ కొనసాగుతోంది. క్రికెటర్‌ అజీమ్‌ రఫీక్ ఉదంతంతో కౌంటీల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. జాత్యహంకారం వల్ల తన కెరీర్‌ నాశనమైందని రఫీక్‌ వాపోయాడు. యూకే పార్లమెంటరీ కమిటీ ఎదుట గత మంగళవారం రఫీక్‌ ఇచ్చిన వాంగ్మూలంలో జాత్యాంహంకారానిక గురైన వారిలో భారత క్రికెటర్‌ కూడా ఉన్నట్లు వెల్లడించాడు. టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ప్లేయర్‌ చెతేశ్వర్ పుజారా యార్క్‌షైర్‌ తరఫున ఆడాడు. జాక్‌ బ్రూక్స్ అనే ఫాస్ట్‌ బౌలర్ పుజారాను ‘స్టీవ్‌’ అనే పదంతో పిలిచేవాడని రఫీక్‌ చెప్పాడు. యార్క్‌షైర్‌ తరఫున ఆడేటప్పుడు బ్రూక్స్ తరచూ ఇలాంటి పదాలనే వాడేవాడని పేర్కొన్నాడు. పుజారా 2015-16లో యార్క్‌షైర్‌ తరఫున, 2017లో నాటింగ్‌హామ్‌షైర్‌ తరఫున ఆడాడు. మళ్లీ 2018 నుంచి యార్క్‌షైర్‌ జట్టుకు ఆడుతున్నాడు. 2015లో బ్రూక్స్, పుజారా యార్క్‌షైర్‌ తరఫున ఆడేవారు.

యూకే పార్లమెంట్‌ కమిటీ ఎదుట రఫీక్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై బ్రూక్స్‌ స్పందించాడు. ‘‘కొందరి పేర్లను పలకడంలో ఇబ్బంది ఎదురైతే ‘స్టీవ్’అనే పదం వాడుతుంటారు’’ అని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో పిలుచుకునే క్రమంలో ‘స్టీవ్‌’ అని ఉండొచ్చేమో కానీ.. అప్పుడు ఇందులో ఎలాంటి జాత్యహంకార ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. అయితే ఆ మాటను ఉపయోగించానని ఒప్పుకుంటున్నానని.. అలా చేయడం అగౌరవం, తప్పు అని ఇప్పుడు అంగీకరిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా చెతేశ్వర్‌ పుజారా, అతడి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. ఆ సమయంలో ఇది జాత్యహంకార ప్రవర్తనగా గుర్తించలేదని, అయితే ఇప్పుడు చూస్తే అది ఆమోదయోగ్యంగా అనిపించలేదని వివరించాడు. అలానే ఇంగ్లాండ్ బౌలర్లు టైమల్‌ మిల్స్‌, స్టీవార్ట్‌ లాడట్‌పై చేసిన ‘నీగ్రో’ పదప్రయోగం పట్ల కూడా క్షమాపణలు చెబుతున్నట్లు బ్రూక్స్ ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని