Novak Djokovic : జకోవిచ్‌కు మళ్లీఎదురు దెబ్బ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడటం అసాధ్యం!

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకోవాలన్న కోరిక జకోవిచ్‌కు ఇప్పట్లో..

Updated : 16 Jan 2022 15:11 IST

వీసా పునరుద్ధరణ పిటిషన్‌ను తిరస్కరించిన ఫెడరల్‌ కోర్టు

మెల్‌బోర్న్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకోవాలన్న కోరిక జకోవిచ్‌కు ఇప్పట్లో తీరేలా లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను సొంతం చేసుకుని ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు (21) సొంతం చేసుకుని రికార్డు సృష్టిద్దామని భావించిన జకోవిచ్‌కు వ్యాక్సినేషన్‌ వ్యవహారం అడ్డంకిగా మారింది. టోర్నీలో ఆడకుండా ఆస్ట్రేలియా మంత్రి రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి ఫెడరల్‌ న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పదకొండు రోజులపాటు సాగిన జకోవిచ్‌ పోరాటం ముగిసింది. సోమవారం నుంచే తొలి రౌండ్ పోటీలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడలేకపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇదీ జరిగింది..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనే ప్లేయర్లు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని నిర్వాహకులు నిబంధన విధించారు. కొవిడ్‌ సోకిందనే కారణంతో జకోవిచ్‌ మినహాయింపు కోరాడు. అందుకు టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. దీంతో టోర్నీ కోసం గత బుధవారం మెల్‌బోర్న్‌ చేరుకున్న జకోను ఎయిర్‌పోర్ట్‌లో సరిహద్దు భద్రతా దళం అడ్డుకుంది. మినహాయింపు కోరేందుకు అతని కారణం సహేతుకంగా లేదని వీసా రద్దు చేసి ఇమిగ్రేషన్‌ నియంత్రణలోని హోటల్‌కు తరలించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన జకోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అతని వీసా పునరుద్ధరించడంతో పాటు ఆ హోటల్‌ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇమిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ మాత్రం తన వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మరోసారి అతని వీసా రద్దు చేశారు. దీనిపైనే కోర్టుకు వెళ్లగా అక్కడా జకోవిచ్‌కు చుక్కెదురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని