IND vs NZ: బాబూ.. ఎవరైనా కాస్త ఆ కాయిన్లను పరీక్షించండయ్యా!

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా...

Updated : 25 Nov 2021 16:00 IST

కివీస్‌ వరుసగా నాలుగోసారి టాస్‌ ఓడిపోవడంపై నీషమ్ స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత పర్యటనలో వరుసగా నాలుగోసారి కివీస్‌ టాస్‌ ఓడిపోవడం గమనార్హం. మూడు టీ20ల సిరీస్‌లోనూ ఒక్కసారి కూడా టాస్‌ నెగ్గలేదు. దీంతో తమ జట్టు టాస్‌ ఓడిపోవడంపై కివీస్‌ ఆటగాడు జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌ వేదికగా తమాషాగా స్పందించాడు. ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే నీషమ్‌ తనదైన హాస్యచతురతతో ట్వీట్లు పెడుతుంటాడు. ఈ క్రమంలోనే టాస్‌ ఓడిపోవడంపై  ‘‘దయ చేసి ఎవరైనా టాస్‌ వేసే కాయిన్లను దగ్గరగా పరీక్షించండి’’ అంటూ సరదాగా ఓ ట్వీట్‌ వేసేశాడు. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్ష కురిసింది. ‘‘ఏమో ఫిక్సింగ్ జరిగిందేమోనని’’ ఒకరు స్పందించగా.. ‘‘ఏం ఫర్వాలేదు.. వచ్చే మ్యాచ్‌కు విరాట్‌ వచ్చేస్తాడు. మీరు తప్పకుండా టాస్‌ గెలుస్తారు.. కంగారు పడకండి’’... ‘విరాట్ కూడా వరుసగా పదిసార్లు టాస్‌ ఓడిపోయాడు.. అయినా మీలాగా ట్విటర్‌లో బాధపడలేదు’’ అంటూ నెటిజన్ల చమక్కులు విసిరారు. 

విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్, బుమ్రా, షమీ వంటి సీనియర్లు లేకుండా అజింక్యా రహానె సారథ్యంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులోకి అరంగేట్రం చేశాడు. కేఎల్‌ రాహల్ గాయపడటంతో అతడి స్థానంలో సూర్యకుమార్‌ వచ్చేశాడు. అయితే తుది జట్టులోకి మాత్రం స్థానం దక్కలేదు. ఓపెనర్లుగా శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ దిగారు. ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌తో కూడిన జట్టు ఆడుతోంది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధిస్తే విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

సోధి తర్వాత రచిన్‌ రవీంద్ర 

న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రచిన్‌ రవింద్ర ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 22 ఏళ్ల ఏడు రోజుల వయసులో కివీస్‌ జట్టులోకి రచిన్‌ వచ్చాడు. ఇష్‌ సోధి (21 ఏళ్ల 325 రోజులు) కివీస్‌ టెస్టు జట్టులోకి వచ్చిన పిన్నవయస్కుడిగా కొనసాగుతున్నాడు. రచిన్‌ రవింద్ర ఇప్పటి వరకు కివీస్‌ తరఫున కేవలం ఆరు టీ20లు మాత్రమే ఆడటం గమనార్హం. భారత్‌పై తొలి టెస్టులో అజాజ్ పటేల్, సోమర్‌విల్లేలతోపాటు రచిన్‌ స్పిన్‌ దాడి చేస్తున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే రచిన్‌కు ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉంది. ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌ తన మొదటి మ్యాచ్‌ను ఆడుతుండటం విశేషం.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని