Tim Southee: పాత బంతితో స్వింగ్‌ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్‌ సౌథీ

తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్‌ బౌలర్‌....

Published : 27 Nov 2021 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్‌ బౌలర్‌ టిమ్ సౌథీ (5/69) కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టు కెరీర్‌లో 13వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా టిమ్ సౌథీ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా విదేశాల్లో ఎక్కువగా పర్యటించడం కలిసొచ్చిందన్నాడు. అక్కడి పరిస్థితులను త్వరితగతిన అర్థం చేసుకోవడం వల్లే మంచి ప్రదర్శన చేయగలుగుతున్నట్లు వెల్లడించాడు. 2008లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన టిమ్‌ సౌథీ ఇప్పటి వరకు 80 టెస్టులు ఆడాడు. మొత్తం 315 వికెట్లు పడగొట్టాడు. ‘‘యువ క్రికెటర్‌గా ఉన్నప్పుడే ప్రపంచమంతా చుట్టిరావడం ఇప్పుడు కలిసొస్తుంది. ఆ పర్యటనల నుంచి ఎంతో నేర్చుకున్నా. వికెట్ల ఆకలి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బాగా రాణించగలం. ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా... నేర్చుకునేందుకు, మెరుగ్గా ఆడేందుకు మార్గాలను అన్వేషించాలి’’ అని చెప్పుకొచ్చాడు. 

టెస్టుల్లో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు సానపట్టాలని, ఎంతో సాధన చేయాలని టిమ్‌ సౌథీ సూచించాడు. ‘‘కొత్త బంతిని ఇరు వైపులా స్వింగ్‌ చేయగలిగాలి. పాత బంతితోనూ రాణించేందుకు తీవ్రంగా కృషి చేయాలి. వికెట్లు తీసేందుకు ఉన్న మార్గాలను ప్రయత్నించాలి. ఉపఖండం పిచ్‌లపైనా ఇదే విధంగా ఆడాల్సి ఉంటుంది. నా వరకైతే పాత బంతితో స్వింగ్‌ రాబట్టేందుకు చాలా కష్టపడ్డాను. దీంతో ఇప్పుడు ఓల్డ్ బాల్‌ను స్వింగ్‌ చేసే నైపుణ్యం సొంతం చేసుకున్నా’’ అని వివరించాడు. భారత్‌తో తొలి టెస్టులో సౌథీతోపాటు జేమీసన్‌ (3/91), అజాజ్‌ పటేల్ (2/90) రాణించారు. రెండో రోజు 258/4 స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగింటిని సౌథీనే తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (50*), విల్‌ యంగ్ (75*) ఉన్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని