Cricketer of the Year: ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్‌గా పాక్‌ ఆటగాడు

కెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాక్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ఎంపికయ్యాడు......

Published : 23 Jan 2022 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాక్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. 2021లో 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్‌ అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ.. 134.89 స్ట్రైక్‌ రేట్‌తో 1,326 పరుగులు సాధించాడు. ఏకంగా 73.66 సగటుతో ఈ రన్స్‌ చేయడం విశేషం.

గతేడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ రిజ్వాన్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో పాక్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రిజ్వాన్‌ నిలిచాడు. గతేడాది మొదటినుంచి పరుగుల వరద పారిస్తూ వస్తున్నాడు. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. టీ20ల్లో కెరీర్‌లోనే తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించాడు. వెస్టిండీస్‌తో కరాచీలో జరిగిన పోరులో 87 పరుగులు సాధించాడు. రానున్న ప్రపంచకప్‌లోనూ రిజ్వాన్‌ తన ఉత్తమ ఆటతీరును కొనసాగించాలని పాక్‌ కోరుకుంటోంది.

బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లాండ్‌ క్రీడాకారిణి, వికెట్‌ కీపర్‌ ట్యామీ బ్యూమోంట్‌ ఐసీసీ ఉమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నికైంది. వీటితోపాటు మరిన్ని పురస్కారాలను ఐసీసీ ప్రకటించింది. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు జాన్నెమన్‌ మలన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌గా ఒమన్‌ ఆల్‌రౌండర్‌ ఆటగాడు జీషన్‌ మక్‌సూద్‌ను ఎన్నుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో జట్టుకు ఉత్తమ సేవలందించినందుకు గానూ ఈ పురస్కారాన్ని అందజేయనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని