Published : 14/10/2021 02:17 IST

IPL 2021: కోల్‌కతా ఫైనల్‌కి.. దిల్లీ ఇంటికి.. 

ఇంటర్నెట్ డెస్క్‌: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ చెమటోడ్చి నెగ్గింది. దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా ఫైనల్‌కి చేరింది. ఓటమి పాలైన దిల్లీ లీగ్ నుంచి నిష్క్రమించింది. కోల్‌కతా ఓపెనర్‌ వెంకటేశ్ అయ్యర్‌ (55: 41 బంతుల్లో 4x4, 3x6) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (46: 46 బంతుల్లో 1x4, 1x6) రాణించాడు. దిల్లీ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో రెండు వికెట్లు, అవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

దిల్లీ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ 12 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత.. రబాడ వేసిన 13వ ఓవర్లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ స్మిత్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నోర్జే వేసిన 16వ ఓవర్లో హెట్‌మైర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ కూడా పంత్‌కి చిక్కాడు. స్వల్ప వ్యవధిలోనే దినేశ్‌ కార్తిక్‌ (0), కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ (0) బౌల్డయ్యారు. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో.. క్రీజులో ఉన్న షకిబ్‌ అల్ హసన్‌ (0), సునీల్ నరైన్ (0) ఔట్ చేశాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులుకు మారింది. అయితే, 19.5 బంతిని రాహుల్ త్రిపాఠి (12) సిక్సర్‌గా మలచడంతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో టైటిల్ పోరులో తలపడనుంది.

అంతకు ముందు, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌.. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్‌ (30*) పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్‌ (18).. మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శివమ్ మావి వేసిన 12వ ఓవర్లో బౌల్డై పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ధావన్‌ కూడా వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో షకిబ్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (6) విఫలమయ్యాడు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (17) దూకుడుగా ఆడాడు. అక్షర్‌ పటేల్ (4) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి రెండు, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్‌ తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని