IPL: మిగిలిన మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లో ఆడించాలి 

కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ పూర్తవగానే...

Published : 09 May 2021 00:58 IST

సెప్టెంబర్‌లో నిర్వహించాలని పీటర్సన్‌ కోరిక..

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ పూర్తవగానే వీలైనంత త్వరగా మిగతా సీజన్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు యూఏఈనే అనువైన వేదికగా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై కచ్చితమైన సమాచారం లేకపోయినా గతేడాది అక్కడే ఈ టోర్నీని దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ మాత్రం మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా సంస్థకు రాసిన కథనంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ‘సెప్టెంబర్‌లో యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని, అందుకు అదే సరైన వేదికని పలువురు మాట్లాడుకుంటుండటం నేను గమనించాను. అయితే, నేను మాత్రం ఆ మెగా ఈవెంట్‌ను ఇంగ్లాండ్‌కు తరలించాలని అనుకుంటున్నాను. సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల ఐదు టెస్టుల సిరీస్‌ తర్వాత కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ ప్రధాన ఆటగాళ్లంతా అక్కడే ఉంటారు. దాంతో అది సరైన వేదిక’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.

ఆ కాలంలో ఇంగ్లాండ్‌లోని వాతావరణం అద్భుతంగా ఉంటుందని, దాంతో లండన్‌ సహా మాంచెస్టర్‌, బర్మింగ్‌హామ్‌, లీడ్స్‌ వేదికలుగా మ్యాచ్‌లు నిర్వహించొచ్చని చెప్పాడు. అలాగే అక్కడ మ్యాచ్‌లు చూసేందుకు ప్రజలకు అనుమతిస్తారని అన్నాడు. దాంతో ఐపీఎల్‌కు కొత్త ఉత్సాహం వస్తుందన్నాడు. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌ను ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికా దేశాల్లో నిర్వహించారని, అలాంటప్పుడు ఈసారి ఇంగ్లాండే సరైన వేదికని పీటర్సన్‌ వివరించాడు. కాగా.. ఇంతకుముందే మిడిల్‌సెక్స్‌, సుర్రే, వార్‌విక్‌షైర్‌, లాంకషైర్‌ లాంటి కౌంటీ క్రికెట్‌ క్లబ్‌లు మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించడానికి ఆసక్తిచూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీటర్సన్‌ అవే మాటలనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని