కోహ్లీ విషయంలో అలా అనుకోను.. కానీ..! 

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి అండగా ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే...

Published : 13 Feb 2021 02:07 IST

వాటిని విస్మరించలేం: పీటర్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి అండగా ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో రహానె.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలుపొందడంతో కోహ్లీ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు పలువురు క్రికెటర్లు, అభిమానుల నుంచి అతడిని కెప్టెన్‌గా తప్పించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పందించిన పీటర్సన్‌ ఓ క్రీడా వెబ్‌సైట్‌లో ఇలా పేర్కొన్నాడు.

‘పరిస్థితులు అలా మారాలని కోరుకోను. కానీ, టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ చుట్టూ జరిగే చర్చను విస్మరించడం అసాధ్యమని చెప్పాలి. కోహ్లీ ఇప్పటికే నాలుగు టెస్టులు ఓడిపోయాడు. అదే సమయంలో రహానె ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాడు. దీంతో సామాజిక మాధ్యమాలు, టీవీ, రేడియో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. భారత్‌కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. దురదృష్టం కొద్దీ ఇలాంటివి చోటుచేసుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీకి ఇంకో ఓటమి అవసరం లేదు. అయితే, రెండో టెస్టులో టీమ్‌ఇండియాకు విజయం అందించే సత్తా అతడికుంది’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు. 

కాగా, గతేడాది ఫిబ్రవరిలో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టెస్టులు ఓడిన సంగతి తెలిసిందే. ఆపై ఆస్ట్రేలియాలో అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ టీమ్‌ఇండియా ఘోర పరాభవం పాలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఓటమి చవిచూసింది. వీటన్నింటికి కోహ్లీ సారథ్యం వహించాడు. మరోవైపు ఆసీస్‌ పర్యటనలో కోహ్లీ తొలి టెస్టు తర్వాత పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వచ్చాక.. రహనె రెండు విజయాలతో సిరీస్‌ కైవసం చేసుకున్నాడు. దీంతో అతడికి జట్టు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఇవీ చదవండి..
నాకింకా 38 ఏళ్లే.. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది
ఇంగ్లాండ్‌ జట్టులో రెండు మార్పులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని