IPL: ఐపీఎల్‌ ప్రసార హక్కులు రూ.40 వేల కోట్లు?

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు మరో జాక్‌పాట్‌ తగలబోతోందా? లీగ్‌ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే అయిదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కుల ధర రూ.35 వేల

Updated : 12 Nov 2021 08:32 IST

దిల్లీ: కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు మరో జాక్‌పాట్‌ తగలబోతోందా? లీగ్‌ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే అయిదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కుల ధర రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ అయిదేళ్ల కాలానికి గాను గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి స్టార్‌ ఇండియా ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే అయిదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి.

అయితే టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులకు కలిపి మరీ రూ.35-40 వేల కోట్ల ధర పలుకుతుందా అన్న సందేహం కలగడం సహజం. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. వచ్చే సీజన్‌ నుంచి లీగ్‌లో పది జట్లు తలపడుతున్నాయి. ఇటీవల రెండు కొత్త ప్రాంఛైజీల కోసం ఏకంగా రూ.12,715 కోట్లు (ఆర్పీఎస్‌జీ రూ.7090 కోట్లు, సీవీసీ క్యాపిటల్స్‌ రూ.5625 కోట్లు) ఐపీఎల్‌ ఖజానాలో చేరడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పెరుగుతుంది. ఆ తర్వాత సీజన్లలోనూ మ్యాచ్‌ల సంఖ్య ఇంకా పెరగొచ్చు కూడా. గతంలో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేలా స్టార్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు వచ్చే సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రసార హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

మరోవైపు కరోనా కారణంగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. దీంతో ఐపీఎల్‌ ప్రసార హక్కులు దక్కించుకునేందుకు అవి కూడా పోటీపడే ఆస్కారముంది. వాటి మధ్య పోటీ కూడా ఈ రేటు పెరిగేందుకు ఓ కారణంగా మారొచ్చు. కొన్నేళ్ల నుంచి ఐపీఎల్‌ విలువ కూడా భారీగా పెరుగుతోంది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి రంగంలోనూ ధరలు పెరిగాయి. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఐపీఎల్‌ ప్రసార హక్కులకు రికార్డు రేటు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు