Updated : 06/10/2021 11:26 IST

IPL 2021: మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో  ముంబయి ఇండియన్స్‌ రెచ్చిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  రన్‌రేట్‌ని కూడా మెరుగుపరుచుకుంది. కౌల్టర్‌నైల్‌ (4/14),  నీషమ్‌ (3/12), బుమ్రా (2/12)  సూపర్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని హడలెత్తించారు.  దీంతో రాజస్థాన్‌ 9 వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ( 50 నాటౌట్‌; 25 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడటంతో.. ముంబయి  ఈ స్వల్ప లక్ష్యాన్ని మరో 70 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది.  ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే సన్‌రైజర్స్‌ జట్టుతో జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు రాజస్థాన్‌ రాయల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని ఓడించాలి. అప్పుడే ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కి చేరే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ, రాజస్థాన్‌ సారథి సంజు శాంసన్‌ మాట్లాడారు.

మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ

‘మేము ఈ స్థితికి వచ్చిన తర్వాత మా శక్తిమేరకు రాణించాలి. ఈ రెండు పాయింట్లు మాకు చాలా కీలకమైనవి. రాజస్థాన్‌ని 90 పరుగులకే కట్టడి చేయడంతో మ్యాచ్‌ని  త్వరగా ముగించే అవకాశం వచ్చింది. ఆటలో పైచేయి సాధించడం ముఖ్యం. మేము బయటకు వచ్చి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. రన్ రేట్‌ను మెరుగుపరుచుకునే  అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో మేం బాగా ఆడాం. ఇషాన్‌ కిషన్‌  కొన్ని మ్యాచ్‌ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడి విషయంలో రిస్క్‌ తీసుకుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అతని సామర్థ్యం మాకు తెలుసు. అతను కొంత సమయం గడపాలని మేము కోరుకున్నాము. అతడు కూడా సరిగ్గా అదే చేశాడు. నీషమ్‌  దృఢమైన వ్యక్తి.  జట్టు వాతావరణాన్ని సందడిగా ఉంచుతాడు.  బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించారు. ఈ టోర్నమెంట్‌లో  ప్రతి జట్టు ఏ జట్టునైనా ఓడించగలదని భావిస్తున్నా. మేం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడటానికి కంటే ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రాజస్థాన్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి మేం ఏం చేయాలో తెలుస్తుంది’ అని రోహిత్‌ శర్మ అన్నాడు.

షార్జా పిచ్‌పై మొదట బ్యాటింగ్‌ చేయడం కష్టం: సంజు శాంసన్‌

‘ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కొంచెం సవాలుతో కూడుకున్న పని.  ఇటువంటి పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టమైన పని. అబుదాబి పిచ్‌పై  ఆడటానికి, షార్జా పిచ్‌పై ఆడటానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది.  అబుదాబి అత్యుత్తమ బ్యాటింగ్ వికెట్లలో ఒకటి. షార్జా పిచ్‌కు అలవాటు పడటం చాలా కష్టం. బ్యాటర్లను ఎక్కువగా నిందించలేం. మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కొంచెం మెరుగ్గా ఉంది. ముంబయి ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేశారు. మేము కొంత సమయం తీసుకున్న తర్వాత తదుపరి మ్యాచ్‌ గురించి ఆలోచించాలి. వచ్చే మ్యాచ్‌లో మేము మెరుగైన ఆటను ఆడాలనుకుంటున్నాం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బలంగా వస్తారని మాకు తెలుసు. పవర్‌ప్లేలో వారు రన్ రేట్ పెంచాలనుకుంటారు’ అని శాంసన్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్