IPL 2021:ధోనిని చూసి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను:రిపాల్‌ పటేల్

సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున రిపాల్‌ పటేల్ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. గుజరాత్‌కి చెందిన ఈ ఆటగాడికి దేశవాళీ టీ20ల్లో మంచి హిట్టర్‌గా పేరుంది.

Published : 06 Oct 2021 01:27 IST

(Photo:Delhi Capitals Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున రిపాల్‌ పటేల్ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. గుజరాత్‌కి చెందిన ఈ ఆటగాడికి దేశవాళీ టీ20ల్లో మంచి హిట్టర్‌గా పేరుంది. ఆడుతున్నది మొదటి మ్యాచ్‌ అనే భయం లేకుండా కఠినమైన పిచ్‌పై 20 బంతుల్లో 18 పరుగులు చేసి దిల్లీ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు రిపాల్‌ పటేల్‌. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోనీ.. రిపాల్‌ పటేల్‌తో  కాసేపు ముచ్చటించాడు.  అనంతరం రిపాల్‌ పటేల్‌ మాట్లాడాడు.  ధోనీ ఆటను చూస్తూ పెరిగానని, అతడిని చూసి క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టానని రిపాల్‌ పటేల్ అన్నాడు.

‘ధోనీ భాయ్‌( మహేంద్ర సింగ్‌ ధోనీ)  వికెట్ల వెనుక కీపింగ్‌ చేస్తున్నప్పుడు నేను బ్యాటింగ్‌ చేయడం అనేది పూర్తిగా భిన్నమైన అనుభూతినిచ్చింది. నేను ఆడుతుంటే ధోనీ భాయ్‌ చూడటం చాలా బాగుంది. ధోనీని చూసే క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టా. అతనిలాగా ఫినిషర్‌ని కావాలనుకుంటున్నా. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోనీతో మాట్లాడా. ప్రతి మ్యాచ్‌ని‌ ఎలా ఫినిష్‌ చేస్తావు, మైదానంలో ఎలా ఆలోచిస్తావు, ఛేదనకు దిగినప్పుడు మనస్సును ఏవిధంగా ఉంచుకుంటావు అనే ప్రశ్నలను అడిగా. మేం చాలా బాగా మాట్లాడుకున్నాం. అతడు నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చాడు. మిశ్రా భాయ్‌ (అమిత్‌ మిశ్రా) చేతుల మీదుగా క్యాప్‌ అందుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. నాకు మొదటి మ్యాచ్ ఆడుతున్నట్టు అనిపించలేదు. జట్టు స్కోరు 71/3 ఉన్నప్పుడు నేను బ్యాటింగ్‌కి దిగా. ప్రతి బంతికి పరుగు చేయాల్సిన పరిస్థితి ఉంది. ధావన్‌ భాయ్‌ (శిఖర్‌ ధావన్‌) క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకోమన్నాడు. అతని సూచనని అనుసరించి సమయం తీసుకన్నా. నా బ్యాటింగ్‌ని ఆస్వాదించా’ అని రిపాల్‌ పటేల్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని