KL Rahul : పరిమిత ఓవర్ల క్రికెట్లో మార్పులు అవసరం : కేఎల్‌ రాహుల్‌

టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యవసర మార్పులు అవసరమని వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ అభిప్రాయపడ్డాడు. గత నాలుగైదేళ్లుగా భారత జట్టు మెరుగ్గా రాణించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల...

Updated : 25 Jan 2022 11:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల జట్టులో మార్పులు అవసరమని తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ అభిప్రాయపడ్డాడు. గత నాలుగైదేళ్లుగా భారత జట్టు మెరుగ్గా రాణించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కూర్పులో మార్పులు చేయాలన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘టీమ్‌ఇండియాకు సారథ్యం వహించాలనే నా కల సాకారమైంది. ఇంతకు మించిన గౌరవం లేదు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి నుంచి మేం చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నాం. దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాం. గత నాలుగైదు ఏళ్లుగా మేం మెరుగ్గానే రాణిస్తున్నాం. అయినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జట్టులో మార్పులు అవసరం’ అని కేఎల్ రాహుల్‌ చెప్పాడు.

జట్టుని సమర్థంగా నడిపించగలను..

రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో పలు ప్రయోగాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా ఆరంభంలోనే మార్‌క్రమ్‌తో బౌలింగ్‌ చేయించి విజయం సాధించాడు. దీంతో రాహుల్ కూడా మ్యాచ్‌ ప్రారంభంలోనే రవిచంద్రన్‌ అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించాడు. అయినా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ఇండియా ఒక్క మ్యచులో కూడా విజయం సాధించకపోవడంతో రాహుల్ నాయకత్వ పటిమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. జట్టుని సమర్థంగా నడిపించగలననే నమ్మకముందని పేర్కొన్నాడు.

‘దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనుకోవట్లేదు. కానీ, జట్టుగా మేము ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. జట్టుకు నాయకత్వం వహిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. విజయాల కంటే మనకు ఎదురైన పరాజయాలే మనల్ని మెరుగ్గా తయారు చేస్తాయి. నా కెరీర్‌ మొత్తం అలాగే సాగింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. నాకు ఆ విశ్వాసం ఉంది. జట్టు సభ్యుల నుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టేందుకు కృషి చేస్తాను. ఐపీఎల్‌లో అయినా, భారత జట్టుకు సారథ్యం వహించినా మెరుగ్గా రాణించగలనన్న నమ్మకం ఉంది’ అని కేఎల్‌ రాహుల్ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని