U19 World CUP: యువ భారత్‌ జోరు.. పసికూన బేజారు

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన భారత జట్టు పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 23 Jan 2022 06:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్‌తో సహా కీలక ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడినా అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ జోరు కొనసాగుతోంది.  ఇప్పటికే క్వార్టర్స్‌ బెర్త్‌ ఖారురు చేసుకున్న భారత జట్టు లీగ్‌ దశలోని చివరి మ్యాచ్‌లో పసికూన ఉగాండాను బెంబేలెత్తించింది. మొదట బ్యాటింగ్‌తో, తర్వాత బౌలింగ్‌తో ఉగాండాను ఉక్కిరి బిక్కిరి చేసి 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత కుర్రాళ్లు  కనీవినీ ఎరుగని రీతిలో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేశారు. రాజ్‌ బవా (162 నాటౌట్, 108 బంతుల్లో 14×4, 8×6), రఘువంశీ (144; 120 బంతుల్లో 22×4, 4×6) ఆకాశమే హద్దుగా సెంచరీలతో వీరవిహారం చేశారు. ఈ జోడీ 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. అనంతరం 406 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా జట్టు పూర్తిగా తేలిపోయింది. ఆ జట్టు 19.4 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్‌ పాస్కల్‌ మురింగి (34) టాప్‌ స్కోరర్‌. మిగతవారు భారత బౌలర్ల దెబ్బకు విలవిలలాడారు. ఉగాండా ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు డకౌట్‌ అయ్యారు. ఒక్కరు 11 పరుగులు, ముగ్గురు తలో 5 పరుగుల చొప్పున చేశారు.  భారత కెప్టెన్‌ నిషాంత్‌ సింధు 4 వికెట్లు తీయగా, రాజ్‌వర్ధన్‌ హంగారేర్కర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌- బిలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇక గ్రూప్‌-ఎలో ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, గ్రూప్‌-సిలో పాకిస్థాన్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, గ్రూప్‌-డిలో శ్రీలంకతో పాటు ఆస్త్రేలియా జట్లు క్వార్టర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాయి.      

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని