IND vs ENG: తొలి రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్‌ 53/3 

ఇంగ్లాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 53/3 పరుగులతో నిలిచింది. డేవిడ్ మలన్‌(26), ఓవర్టన్‌(1) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది.  

Updated : 02 Sep 2021 23:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 53/3 పరుగులతో నిలిచింది. డేవిడ్ మలన్‌(26), ఓవర్టన్‌(1) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌(5), హసీమ్‌ హమీద్‌(0)లను బుమ్రా ఇన్నింగ్స్‌ ఒకే ఓవర్లో ఔట్‌ చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 2, ఉమేశ్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తీశారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తొలి ఇన్నింగ్ప్‌లో 191 పరుగులకే ఆలౌట్‌ అయింది. టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(50) కాస్త ఫర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. శార్దూల్‌ ఠాకూర్‌(57; 36 బంతుల్లో 4×7, 6×3) వేగంగా పరుగులు రాబట్టాడు. రోహిత్‌ శర్మ(11), కేఎల్ రాహుల్‌(17), పుజారా(4), జడేజా(10),రహానె(14), రిషభ్‌ పంత్‌ (9) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌వోక్స్‌ నాలుగు, రాబిన్‌సన్‌ మూడు వికెట్లు తీయగా అండర్సన్‌, ఓవర్టన్‌ చెరో వికెట్‌ తీశారు.

నిరాశపర్చిన టాప్‌ఆర్డర్‌

టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. మ్యాచ్‌ ప్రారంభమైన గంటకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తొలుత క్రిస్‌వోక్స్‌ రోహిత్‌ శర్మ(11)ను ఔట్‌ చేయగా తర్వాత రాబిన్‌సన్‌.. కేఎల్‌ రాహుల్‌(17)ను వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే అండర్సన్‌.. చెతేశ్వర్‌ పుజారా(4)ను సైతం పెవిలియన్‌ చేర్చి భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. దాంతో టీమ్‌ఇండియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై కోహ్లీ, రవీంద్ర జడేజా(10) మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.

దూకుడుగా ఆడిన శార్దూల్‌.. 

అయితే, భోజన విరామం తర్వాత మరింత చెలరేగిన ఇంగ్లాండ్‌ పేసర్లు ఈసారి జడేజా, కోహ్లీ, రహానెను పెవిలియన్‌ పంపారు. ఐదో ఆటగాడిగా బరిలోకి దిగిన జడేజా బాగా ఆడతాడనుకున్నా విఫలమయ్యాడు. వోక్స్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. అనంతరం కోహ్లీ అర్ధశతకం పూర్తిచేసుకొని రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 105 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓవర్టన్‌ బౌలింగ్‌లో రహానె(14), వోక్స్‌ బౌలింగ్‌లో పంత్‌(9) కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్‌ ఠాకూర్‌.. ఉమేశ్‌ యాదవ్‌తో(10) కలిసి‌ ఎనిమిదో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. అయితే, జట్టు స్కోర్‌ 190 పరుగుల వద్ద అతడు క్రిస్‌వోక్స్‌ ఔలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. భారత్‌ తర్వాతి రెండు వికెట్లను మరుసటి ఓవర్‌లోనే కోల్పోయింది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని