IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌..వారిద్దరూ రాణించకపోతే భారత్‌పై ఒత్తిడి తప్పదు: హఫీజ్‌

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించకపోతే టీమ్ఇండియాపై...

Published : 23 Jan 2022 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించకపోతే టీమ్ఇండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని పాక్ మాజీ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌ వేదికగా జరిగే 2022 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాక్‌తో కలిసి భారత్ ఒకే గ్రూప్‌లో తలపడనుంది. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహమ్మద్‌ హఫీజ్‌ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ భారీగా పరుగులు చేయకపోతే టీమ్‌ఇండియా ఒత్తిడిలో పడిపోతుంది. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నా ఎక్కువగా వీరిద్దరిపైనే భారత్‌ ఆధారపడుతోంది. పాక్‌ వంటి టీమ్‌తో ఆడేటప్పుడు ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీరిద్దరూ ఆడకపోతే ఇతర టీమ్ఇండియా ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవు. అయితే మిగతావారిని తక్కువగా అంచనా వేయడం లేదు’’ అని పేర్కొన్నాడు. 

41 ఏళ్ల మహమ్మద్‌ హఫీజ్‌ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. గత ప్రపంచకప్‌లో గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లిన పాకిస్థాన్‌... ఆసీస్ చేతిలో భంగపాటుకు గురైంది. తొలి మ్యాచ్‌లోనే భారత్‌పై పది వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ‘‘నా క్రికెట్ జీవితంలో అదొక మరుపురాని సంఘటన. ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించే జట్టులో సభ్యుడినైనందుకు సంతోషంగా ఉంది. క్రికెట్‌ రిటైర్‌మెంట్ ప్రకటించే ముందే ఆ ఫీట్‌ను సాధించడం బాగుంది’’ అని వివరించాడు. అక్టోబర్‌ 23న భారత్‌, పాక్‌ జట్ల మధ్య మెల్‌బోర్న్‌ మైదానం వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని