Rohit Sharma: హిట్‌మ్యాన్ ఫిట్‌గా ఉంటే.. టెస్టు పగ్గాలు ఎందుకు అప్పగించకూడదు?: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఫిట్‌గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్‌కి టెస్టు...

Published : 25 Jan 2022 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఫిట్‌గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్‌కి టెస్టు ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే, గాయం కారణంగా అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం.. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.

‘రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే.. టెస్టు ఫార్మాట్‌కు కూడా అతడినే ఎందుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించకూడదు.? ఇప్పటికే వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అతడిని.. కెప్టెన్‌గా ఎందుకు ప్రమోట్‌ చేయకూడదు. రిషభ్ పంత్‌ కూడా అద్భుతమైన ఆటగాడు. ఒక కోచ్‌గా అతడి ఆట తీరు పట్ల గర్వపడుతున్నాను. ఆట పట్ల అతడి దృక్పథం చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది అతడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకుంటాడని చెబుతుంటారు. అందులో వాస్తవం లేదు. అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. జట్టు విజయం కోసం శాయశక్తులా కష్టపడతాడు. అందుకే కెప్టెన్సీ గురించి చర్చ జరిగినప్పుడు అతడిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

* రోహిత్‌కే తొలి ప్రాధాన్యం : షేన్ వార్న్

భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో తొలి ప్రాధాన్యం రోహిత్‌ శర్మకే ఇవ్వాలని ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అన్నాడు. ‘టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలుకుతూ విరాట్‌ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పట్ల నేనేమీ ఆశ్చర్యపోలేదు. భారత జట్టుకు సారథ్యం వహించడమనేది మామూలు విషయం కాదు. టీమ్‌ఇండియా కెప్టెన్‌పై ఎప్పుడూ భారీ అంచనాలు, ఒత్తిళ్లు ఉంటాయి. అయినా కోహ్లీ తన నాయకత్వ పటిమతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటికీ అతడిలో చాలా క్రికెట్‌ మిగిలి ఉంది. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డున్న రోహిత్‌ శర్మకే.. టెస్టు కెప్టెన్సీ విషయంలో తొలి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌కి బాధ్యతలు అప్పగించినా ఫర్వాలేదు. అజింక్య రహానె ఇంకా మెరుగ్గా జట్టుని నడిపించగలడు. కానీ, ప్రస్తుతం అతడు ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఒకవేళ అతడు మునుపటి ఫామ్‌ను అందుకుంటే.. నిస్సందేహంగా అతడికి టెస్టు కెప్టెన్సీ అప్పగించవచ్చు’ అని షేన్‌ వార్న్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని