మద్యం మత్తులో క్రికెటర్ల రచ్చ

యాషెస్‌ సిరీస్‌లోని చివరి టెస్టు ముగిసిన తర్వాత హోటల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లలోని కొంతమంది ఆటగాళ్లు కలిసి చేసుకున్న మద్యం విందు చర్చనీయాంశంగా మారింది. రాత్రి పొద్దుపోయాక

Published : 19 Jan 2022 02:39 IST

హోబర్ట్‌: యాషెస్‌ సిరీస్‌లోని చివరి టెస్టు ముగిసిన తర్వాత హోటల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లలోని కొంతమంది ఆటగాళ్లు కలిసి చేసుకున్న మద్యం విందు చర్చనీయాంశంగా మారింది. రాత్రి పొద్దుపోయాక తాగుడు మొదలెట్టిన ఆటగాళ్లు.. తెల్లవారు జాము వరకూ నానా హంగామా చేసినట్లు తెలిసింది. ఆ హోటల్లో బస చేసిన మరో వ్యక్తి.. ఈ అల్లరి భరించలేక సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆటగాళ్లను వాళ్ల గదుల్లోకి పంపించారు. ఈ తతంగానికి సంబంధించిన ఓ వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. అందులో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌తో పాటు వెటరన్‌ పేసర్‌ అండర్సన్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు కేరీ, హెడ్‌, లైయన్‌ కనిపించారు. దీంతో ఈ ఘటనపై విచారణ మొదలెట్టినట్లు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మంగళవారం వెల్లడించింది. ‘‘హోబర్ట్‌లోని హోటల్లో జట్టుకు కేటాయించిన ప్రదేశంలో సోమవారం తెల్లవారు జామున ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు కలిసి మద్యం తాగారు. ఆ హోటల్లో బస చేసిన ఓ వ్యక్తి తన ఏకాగ్రతకు భంగం కలుగుతుందని సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. పోలీసులకు సమాచారం వెళ్లడంతో వాళ్లు రంగంలోకి దిగారు. ఆటగాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోమని హోటల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు టస్మేనియా పోలీసులు చెప్పగానే వాళ్లు గదుల్లోకి వెళ్లారు. కలిగిన అసౌకర్యానికి ఇంగ్లాండ్‌ బృందం క్షమాపణలు చెప్పింది’’ అని ఈసీబీ పేర్కొంది. మత్తులో ఉన్న వ్యక్తులు ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 6 గంటలకు హోటల్‌ నుంచి ఫోన్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాళ్లను గదుల్లోకి పంపించామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని