మైదానంలో వేద పండితులు

క్రికెట్‌ మైదానంలో ఎటు చూసినా పంచెలు కట్టుకుని.. కుర్తాలు ధరించిన వేద పండితులే కనిపిస్తున్నారు. అక్కడ ఏదో పూజ కార్యక్రమం జరుగుతోందని అనుకుంటే పొరపడ్డట్టే! ఎందుకంటే మంత్రాలు,

Published : 19 Jan 2022 02:39 IST

భోపాల్‌: క్రికెట్‌ మైదానంలో ఎటు చూసినా పంచెలు కట్టుకుని.. కుర్తాలు ధరించిన వేద పండితులే కనిపిస్తున్నారు. అక్కడ ఏదో పూజ కార్యక్రమం జరుగుతోందని అనుకుంటే పొరపడ్డట్టే! ఎందుకంటే మంత్రాలు, వేదాలు చదివే ఆ పండితులు.. మైదానంలో పరుగులు, వికెట్లు అంటూ ఆటలో నిమగ్నమయ్యారు. పంతుళ్లేంటీ? క్రికెట్‌ ఆడడమేంటీ? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేద పండితుల కోసమే ప్రత్యేకంగా ఓ క్రికెట్‌ టోర్నీ జరుగుతోంది. దోవతి, కుర్తా లాంటి సంప్రదాయ వస్త్రాలు ధరించి మరీ ఆడే ఆటగాళ్ల మధ్య సంభాషణతో పాటు ఆ మ్యాచ్‌ల వ్యాఖ్యానం కూడా సంస్కృతంలోనే కొనసాగుతుండడం మరో విశేషం. మహా రుషి యోగి జయంతిని పురస్కరించుకుని స్థానిక అంకుర్‌ మైదానంలో వేద పండితులకు నాలుగు రోజుల క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తున్నారు. ప్రాచీన సంస్కృత భాషకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు వేద పండితుల కుటుంబాల్లో క్రీడా సంస్కృతిని అలవాటు చేసేందుకే ఈ పోటీలు జరుపుతున్నారు. ‘‘వేదాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించే పండితులే ఈ టోర్నీలో ఆటగాళ్లు. వాళ్లు సంప్రదాయ వస్త్రాలే ధరించి పోటీల్లో పాల్గొంటారు. ఈ టోర్నీ నిర్వహించడం ఇది రెండో ఏడాది. మ్యాచ్‌లో ఆటగాళ్లు సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. వ్యాఖ్యానం కూడా ఆ భాషలోనే ఉంటుంది. వివిధ వేద సంస్థలకు చెందిన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. పంచె కట్టుతో ఆడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కూడా అలా బరిలో దిగే ఫోర్లు, సిక్సర్లు కొట్టా. గతంలో కాశీలో ఇలా ఓ టోర్నీకి సంస్కృతంలోనే వ్యాఖ్యానం చేశారు’’ అని సంస్కృతి బచావో మంచ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని