Rafael Nadal : నాదల్‌ జోరు షురూ..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ లేకుండానే ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆరంభమైంది. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడడంపై 11 రోజుల పాటు కొనసాగిన నాటకీయత ముగిసిన నేపథ్యంలో.. ఇక పోటీలపైకి అందరి దృష్టి మళ్లింది. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో నాదల్‌.

Updated : 18 Jan 2022 12:49 IST

ఒసాక, బార్టీ, జ్వెరెవ్‌ శుభారంభం
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
మెల్‌బోర్న్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ లేకుండానే ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆరంభమైంది. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడడంపై 11 రోజుల పాటు కొనసాగిన నాటకీయత ముగిసిన నేపథ్యంలో.. ఇక పోటీలపైకి అందరి దృష్టి మళ్లింది. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో నాదల్‌.. వరుసగా రెండో ఏడాది టోర్నీ నెగ్గాలనే ధ్యేయంతో బరిలో దిగిన ఒసాక శుభారంభం చేశారు. మరోవైపు ఈ టోర్నీ 2020 ఛాంపియన్‌ కెనిన్‌కు తొలి రౌండ్లోనే షాక్‌ తగిలింది.

సహచర దిగ్గజ ఆటగాళ్లు ఫెదరర్‌, జకోవిచ్‌ లేకపోవడంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేసిన నాదల్‌ (స్పెయిన్‌) తన వేట మొదలెట్టాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ ఆరో సీడ్‌ ఆటగాడు 6-1, 6-4, 6-2 తేడాతో మార్కోస్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. గాయాల కారణంగా కొద్ది కాలం ఆటకు దూరంగా ఉన్న నాదల్‌.. ఈ మ్యాచ్‌లో మునుపటి జోరు ప్రదర్శించాడు. వేగవంతమైన సర్వీస్‌లతో, పదునైన ఏస్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. తొలి సెట్‌లో బ్యాక్‌ హ్యాండ్‌ విన్నర్‌తో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-1తో ఆధిక్యం సాధించిన అతను ఇక ఆగలేదు. ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ విన్నర్లతో ఆధిపత్యం చలాయించి తొలి సెట్‌ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి అతనికి కాస్త పోటీ ఎదురైంది. తొలి గేమ్‌లోనే మార్కోస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌.. 2-0తో ఆధిక్యం సాధించాడు. కానీ ఆ దశలో పుంజుకున్న మార్కోస్‌ పోరాట పటిమ ప్రదర్శించాడు. సుదీర్ఘంగా సాగిన తొమ్మిదో గేమ్‌లో నాదల్‌ను గొప్పగా నిలువరించిన అతను పుంజుకునేలా కనిపించాడు. కానీ అనవసర తప్పిదాలతో తర్వాతి గేమ్‌ చేజార్చుకుని సెట్‌ కోల్పోయాడు. ఇక మూడో సెట్లో నాదల్‌ మళ్లీ పూర్తిస్థాయిలో చెలరేగి అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 7 ఏస్‌లు సంధించిన నాదల్‌.. 34 విన్నర్లు కొట్టాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7-6 (7-3), 6-1, 7-6 (7-1)తో తన దేశానికే చెందిన డానియల్‌పై పోరాడి గెలిచాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రపంచ మూడో ర్యాంకర్‌ జ్వెరెవ్‌కు ఊహించని పోటీ ఎదురైంది. తొలి సెట్‌ ఆరంభం నుంచి ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో స్కోరు సమమవుతూ సాగింది. 91వ ర్యాంకర్‌ డానియల్‌ గొప్పగా పోరాడాడు. చివరకు 6-6తో టైబ్రేకర్‌ తప్పలేదు. అందులో జ్వెరెవ్‌ పైచేయి సాధించాడు. ఈ ఉత్సాహంతో   చెలరేగిన అతను.. రెండో సెట్లో ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయాడు. మూడో సెట్లో డానియల్‌ పుంజుకున్నట్లు కనిపించాడు. కచ్చితమైన షాట్లతో పాయింట్లు రాబట్టిన అతను.. జ్వెరెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 4-2తో ఆధిక్యం సాధించాడు. కానీ జ్వెరెవ్‌ తన అనుభవాన్ని ఉపయోగించి వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 5-4తో నిలిచాడు. అక్కడి నుంచి పోరు మరో స్థాయికి చేరింది. మళ్లీ టైబ్రేకర్‌లో జ్వెరెవ్‌ గెలిచి మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ బెరెట్టిని (ఇటలీ) 4-6, 6-2, 7-6 (7-5), 6-3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్‌ హర్కాజ్‌ (పోలెండ్‌) 6-2, 7-6 (7-3), 6-7 (5-7), 6-3తో గెరసిమోవ్‌ (బెలారస్‌)పై గెలిచారు. షపోవలోవ్‌ (కెనడా), మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌), నోరీ (బ్రిటన్‌), కచనోవ్‌ కూడా ముందంజ వేశారు.

ఆ దిశగా అడుగు..: మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒసాక (జపాన్‌) టైటిల్‌ నిలబెట్టుకునే దిశగా మొదటి అడుగు వేసింది. తొలి రౌండ్లో ఆమె 6-3, 6-3తో ఒసోరియో (కొలంబియా)ను చిత్తుచేసింది. తన మెరుపు షాట్ల ముందు ప్రత్యర్థి నిలబడలేకపోయింది. తొలి సెట్‌లో తన సర్వీస్‌ నిలబెట్టుకుంటూ.. ఒసోరియో సర్వీస్‌ బ్రేక్‌ చేస్తూ సాగిన ఒసాక వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి 5-0తో దూసుకెళ్లింది. ఆ దశలో ఒసాక అనవసర తప్పిదాలను అనుకూలంగా మలుచుకున్న ఒసోరియో వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఏస్‌లతో చెలరేగిన ఒసాక సెట్‌ ముగించింది. రెండో సెట్‌లో మొదటి నుంచే ప్రత్యర్థి పోరాడినా ఒసాకానే ఆధిపత్యం చలాయించింది. ఓ దశలో 4-3తో నిలిచిన ఆమె.. వరుసగా రెండు గేమ్‌లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఒసాక 4 ఏస్‌లు, 19 విన్నర్లు కొట్టింది. మరోవైపు సొంతగడ్డపై టైటిల్‌ గెలిచి చరిత్ర తిరగరాయాలనే లక్ష్యంతో ఉన్న టాప్‌ సీడ్‌ ఆష్లీ బార్టీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 6-0, 6-1తో సురెంకో (ఉక్రెయిన్‌)పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆమె కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయింది. తన జోరుతో పోరును ఏకపక్షంగా మార్చేసిన ఆమె 5 ఏస్‌లు, 14 విన్నర్లు కొట్టింది. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-2, 6-0తో పెట్కోవిచ్‌ (జర్మనీ)పై, అయిదో సీడ్‌ సకారి (గ్రీస్‌) 6-4, 7-6 (7-2)తో మారియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్‌ బడోసా (స్పెయిన్‌) 6-4, 6-0తో తొమ్ల్‌జనోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. అజరెంకా, అనిసిమోవ, బెన్సిచ్‌, స్వితోలినా కూడా రెండో రౌండ్లో అడుగు పెట్టారు. మరోవైపు మాజీ ఛాంపియన్‌ కెనిన్‌, కోకో గాఫ్‌ (అమెరికా) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. పదకొండో సీడ్‌ కెనిన్‌ 6-7 (2-7), 5-7తో మాడిసన్‌ కీస్‌ చేతిలో, గాఫ్‌ 4-6, 2-6తో వాంగ్‌ (చైనా) చేతిలో ఓడారు.


ఫ్రెంచ్‌ ఓపెన్‌కూ జకో కష్టమే!

దుబాయ్‌: రెండు డోసుల టీకా వేసుకోని కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు  దూరమైన ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌.. ఈ ఏడాదిలో రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఆడడం అనుమానంగా మారింది. ఫ్రాన్స్‌లోని కొత్త చట్టమే అందుకే కారణం. ఆదివారం అక్కడి పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం ప్రకారం.. క్రీడా స్టేడియాలు, రెస్టారెంట్ల లాంటి బహిరంగ ప్రదేశాల్లో టీకా వేసుకున్నట్లు టీకా ధ్రువీకరణ పత్రం ఉన్నవాళ్లనే అనుమతిస్తారు. ‘‘కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత టీకా వేసుకున్న వాళ్లకే బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశం ఉంటుంది. అది ఎవరైనా సరే. ఓ ప్రేక్షకుడైనా లేదా ఓ క్రీడాకారుడైనా.. అందరికీ ఒకటే నిబంధన. అందుకు ఎవరికీ మినహాయింపు  ఉండదు’’ అని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది. ఆ దేశ ఎంపీ క్రిస్టోఫె కాస్టనర్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. మే చివర్లో ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ కోసం మొదట పటిష్ఠమైన బయో బబుల్‌ను ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీకా వేసుకున్న వాళ్లనే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం ఆ దేశం వెళ్లిన జకోవిచ్‌.. రెండు డోసుల టీకా వేసుకోని నేపథ్యంలో వీసా రద్దుతో స్వదేశం బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి విమానంలో దుబాయ్‌ చేరుకున్న అతను..అక్కడి నుంచి సెర్బియాకు మరో విమానంలో వెళ్లాడు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని