IND vs NZ: పడగొట్టేస్తారా?

కాన్పూర్‌ టెస్టుపై టీమ్‌ఇండియా మరింత పట్టుబిగించింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిలో మరో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో కుప్పకూలే స్థితి నుంచి తేరుకుని న్యూజిలాండ్‌కు కఠిన సవాలును విసిరిన భారత్‌.. త్వరగానే వికెట్ల వేటను మొదలెట్టింది.

Updated : 29 Nov 2021 06:53 IST

తొలి టెస్టుపై పట్టు బిగించిన భారత్‌

రాణించిన శ్రేయస్‌, సాహా

రెండో ఇన్నింగ్స్‌లో 234/7 డిక్లేర్డ్‌

న్యూజిలాండ్‌ లక్ష్యం 284; ప్రస్తుతం 4/1

కాన్పూర్‌

కాన్పూర్‌ టెస్టుపై టీమ్‌ఇండియా మరింత పట్టుబిగించింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిలో మరో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో కుప్పకూలే స్థితి నుంచి తేరుకుని న్యూజిలాండ్‌కు కఠిన సవాలును
విసిరిన భారత్‌.. త్వరగానే వికెట్ల వేటను మొదలెట్టింది. ప్రత్యర్థి ఛేదనలో నాలుగు పరుగులకే ఓ వికెట్‌ చేజిక్కించుకుంది. సాహా కూడా విలువైన అర్ధశతకం సాధించాడు. కివీస్‌ లక్ష్యం 284 కాగా.. ప్రస్తుత స్కోరు 4/1. చేతిలో 9 వికెట్లున్న కివీస్‌.. ఆతిథ్య జట్టు విజయాన్ని అడ్డుకోవాలంటే అసాధారణంగా రాణించాల్సిందే. భారత్‌లో ఇప్పటివరకు ఏ పర్యటక జట్టు కూడా 276కు మించిన లక్ష్యాన్ని ఛేదించలేదు.

మొదటి టెస్టులో భారత జట్టు విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతున్న న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. ఈసారి తన రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత క్లిష్టపరిస్థితుల నుంచి బలంగా పుంజుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ (65; 125 బంతుల్లో 8×4, 1×6) మరో విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. సౌథీ (3/75),    జేమీసన్‌ (3/40), అజాజ్‌ పటేల్‌ (1/60) ధాటికి 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌.. శ్రేయస్‌తో పాటు వృద్ధిమాన్‌ సాహా (61 నాటౌట్‌; 126 బంతుల్లో 4×4, 1×6), అశ్విన్‌ (32; 62 బంతుల్లో 5×4) పోరాడడంతో 234/7 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో న్యూజిలాండ్‌ 4 పరుగులకే ఓపెనర్‌ యంగ్‌ (2) వికెట్‌ను కోల్పోయి నాలుగో రోజు ఆటను ముగించింది. అతణ్ని అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లేథమ్‌ (2), సోమర్‌విలే (0) క్రీజులో ఉన్నారు. చివరి రోజు భారత స్పిన్నర్లను ఎదుర్కొని నిలవడం కివీస్‌కు చాలా కష్టమైన పనే. ఓ పర్యటక జట్టు భారత్‌లో ఛేదించిన అత్యధిక లక్ష్యం 276. ఛేదించిన జట్టు (1987లో) వెస్టిండీస్‌.

వారెవ్వా శ్రేయస్‌..: నాలుగో రోజు శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్‌ సాహాలే భారత హీరోలు. జట్టు కుప్పకూలే ప్రమదాన్ని తప్పించారు. ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ అరంగేట్రంలో సెంచరీ, అర్ధసెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలవగా.. సాహా అమూల్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నిజానికి ఉదయం సెషన్లో కివీస్‌ చక్కని అవకాశం సృష్టించుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 14/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. సౌథీ, జేమీసన్‌, అజాజ్‌ పటేల్‌ ధాటికి 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కివీస్‌ అదే జోరును కొనసాగించి ఉంటే మ్యాచ్‌లో బలమైన స్థితిలో నిలిచేదే. కానీ శ్రేయస్‌ ఆ జట్టు ప్రయత్నాలకు గండి కొట్టాడు. అశ్విన్‌తో కలిసి భారత్‌ను ఆదుకున్నాడు. ఆడుతున్నది తొలి టెస్టే అయినా శ్రేయస్‌ ఎంతో పరిణతిని ప్రదర్శించాడు. స్లో పిచ్‌పై బంతిని ఆలస్యంగా ఆడిన అతడు.. థర్డ్‌మన్‌ దిశగా ఎక్కువగా పరుగులు రాబట్టాడు. అశ్విన్‌ కూడా చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. ఆరో వికెట్‌కు 52 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన అశ్విన్‌ ఔటైనా.. శ్రేయస్‌ పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడు. ఇబ్బందుల నుంచి కాస్త తేరుకున్న జట్టును.. సాహాతో కలిసి మరింత సురక్షిత స్థితికి చేర్చాడు. ఎంతో సంయమనాన్ని ప్రదర్శించిన అతడు వీలైనప్పుడల్లా ఫోర్‌ కొట్టాడు. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి కళ్లు చెదిరే సిక్స్‌ దంచాడు. 109 బంతుల్లో అర్ధశతకం సాధించిన శ్రేయస్‌.. ఆ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టీకి ముందు చివరి ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో ఓ పుల్‌ షాట్‌ ఆడబోయిన అతడు బ్లండెల్‌కు చిక్కడంతో 64 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అప్పటికి మ్యాచ్‌లో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. సాహాది కూడా చాలా విలువైన ఇన్నింగ్సే. చక్కని డ్రైవ్‌లు, ఫ్లిక్స్‌ ఆడిన అతడు.. స్లాగ్‌ పుల్‌తో ఓ సిక్స్‌ కూడా కొట్టాడు. శ్రేయస్‌ను ఔట్‌ చేశాకనైనా భారత్‌ను త్వరగా ఆలౌట్‌ చేయొచ్చనుకున్న కివీస్‌ ఆశలపై అతడు నీళ్లు చల్లాడు. అక్షర్‌ పటేల్‌ (28 నాటౌట్‌; 67 బంతుల్లో 2×4, 1×6) కలిసి అభేద్యమైన ఏడో వికెట్‌కు సాహా 20.4 ఓవర్లలో 67 పరుగులు జోడించడంతో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తిరుగులేని స్థితికి చేరుకుంది.

రహానె విఫలం..: ఉదయం సెషన్‌ పూర్తిగా న్యూజిలాండ్‌దే. చకచకా వికెట్లు పడగొట్టిన ఆ జట్టు భారత్‌ను గట్టి దెబ్బ తీసి.. మ్యాచ్‌లో తన అవకాశాలను పెంచుకుంది. ఆతిథ్య జట్టుకు మొదట జేమీసన్‌ షాకిచ్చాడు. అతడు పుజారా (22)ను ఔట్‌ చేశాడు. బంతి పుజారా గ్లోవ్స్‌ను తాకుతూ వెళ్లి వికెట్‌కీపర్‌ చేతుల్లో పడింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఔటివ్వనప్పటికీ.. కివీస్‌ సమీక్షలో వికెట్‌ను సాధించింది. జట్టులో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో, తప్పక రాణించాల్సి స్థితిలో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ తాత్కాలిక కెప్టెన్‌ రహానె (4) మరోసారి తడబడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌ 35 పరుగులన్నా చేసిన అతడు.. ఈసారి రెండంకెల స్కోరు కూడా అందుకోలేదు. త్వరగా నిష్క్రమించి జట్టును కష్టాల్లోకి నెట్టాడు. ఎదుర్కొన్న 14వ బంతికి గానీ ఖాతా తెరవలేపోయిన అతడు.. చివరికి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అజాజ్‌కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత సౌథీ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు షాకిచ్చాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ రెండో బంతిని ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించిన మయాంక్‌ (17) ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌తో లేథమ్‌కు చిక్కాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతికి జడేజా (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. 51 పరుగులే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ శ్రేయస్‌ పోరాటంతో తిరిగి గాడినపడింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) లేథమ్‌ (బి) సౌథీ 17; గిల్‌ (బి) జేమీసన్‌ 1; పుజారా (సి) బ్లండెల్‌ (బి) జేమీసన్‌ 22; రహానె ఎల్బీ (బి) అజాజ్‌ పటేల్‌ 4; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 65; జడేజా ఎల్బీ (బి) సౌథీ 0; అశ్విన్‌ (బి) జేమీసన్‌ 32; సాహా నాటౌట్‌ 61; అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 28; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (81 ఓవర్లలో) 234/7 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-2, 2-32, 3-41, 4-51, 5-51, 6-103, 7-167; బౌలింగ్‌: సౌథీ 22-2-75-3; జేమీసన్‌ 17-6-40-3; అజాజ్‌ పటేల్‌ 17-3-60-1; రచిన్‌ రవీంద్ర  9-3-17-0; సోమర్‌విలే 16-2-38-0

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లేథమ్‌ బ్యాటింగ్‌ 2; యంగ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 2; సోమర్‌విలే బ్యాటింగ్‌ 0 మొత్తం: (4 ఓవర్లలో) 4/1; వికెట్ల పతనం: 1-3; బౌలింగ్‌: అశ్విన్‌ 2-0-3-1; అక్షర్‌ పటేల్‌ 2-1-1-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని