Steve Smith: టెస్టు కెప్టెన్సీ రేసులో స్మిత్‌

స్టీవెన్‌ స్మిత్‌ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ రేసులో నిలిచాడు. అతణ్ని టెస్టు కెప్టెన్‌ను చేయాలన్న  ప్రతిపాదనతో సెలక్టర్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డును సంప్రదించినట్లు సమాచారం. వైస్‌ కెప్టెన్‌ కమిన్స్‌...

Updated : 21 Nov 2021 07:30 IST

మెల్‌బోర్న్‌: స్టీవెన్‌ స్మిత్‌ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ రేసులో నిలిచాడు. అతణ్ని టెస్టు కెప్టెన్‌ను చేయాలన్న  ప్రతిపాదనతో సెలక్టర్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డును సంప్రదించినట్లు సమాచారం. వైస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ కూడా ప్రధాన పోటీదారుడుగా ఉన్నాడు. టిమ్‌ పైన్‌ రాజీనామాతో ఆసీస్‌కు కొత్త కెప్టెన్‌ అవసరమైన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాలో బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం కారణంగా స్మిత్‌ ఏడాది నిషేధానికి గురయ్యాడు. రెండేళ్ల పాటు అతణ్ని కెప్టెన్సీకి దూరం పెట్టాలని కూడా ఆసీస్‌ బోర్డు నిర్ణయించింది.

పైన్‌ను అప్పుడే తొలగించకపోవడం తప్పే... సీఏ ఛైర్మన్‌: మహిళా సహ ఉద్యోగికి అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలపై విచారణ జరిగినప్పుడే టిమ్‌ పైన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించకపోవడం తప్పేనని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఛైర్మన్‌ రిచర్డ్‌ అన్నాడు. 2017లో ఆ మహిళా ఉద్యోగికి పైన్‌ అభ్యంతరకర, అవాంఛనీయ లైంగిక సందేశాలు పంపించాడంటూ ఇటీవల ఆ దేశ మీడియాలో కథనాలు రావడంతో తాజాగా పైన్‌ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై 2018లో సీఎ జరిపిన విచారణలో అతను ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని తేలడంతో సారథిగా కొనసాగాడు. ‘‘2018లో సీఏ తీసుకున్న నిర్ణయంపై మాట్లాడను. ఎందుకంటే అప్పుడు నేనందులో లేను. కానీ ప్రస్తుతం బయటకు వచ్చిన వాస్తవాలను చూస్తే అప్పుడు సీఏ ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కాదు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యమైనదేనని, దానిపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోరనే తప్పుడు సందేశాన్ని అది పంపించింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ కెప్టెన్‌ స్థానమంటే దానికి అత్యున్నత ప్రమాణాలుండాలి. ఇప్పుడు ప్రవర్తనా నియామవళి సముచితంగా ఉంది. అప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరిగాయి. లైంగిక వాంఛతో పంపించే సందేశాల గురించి గురించి మాట్లాడే కార్యక్రమం 2018 నుంచే ఉంది. లైంగిక హింస విద్య గురించి పూర్తి సమీక్ష చేశాం’’ అని రిచర్డ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని