T20 World Cup: 50 బంతులుండగానే

ఇంగ్లాండ్‌ ఎంత జోరు మీదున్నప్పటికీ.. ఆస్ట్రేలియాతో ఆ జట్టు మ్యాచ్‌ మరీ ఇంత ఏకపక్షం అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఆసీస్‌ను పసికూనలా మార్చేసిన ఇంగ్లిష్‌ జట్టు.. చిత్తు చిత్తుగా ఓడించేసింది. కంగారూలు ఆపసోపాలు...

Updated : 31 Oct 2021 06:45 IST

కంగారూలు చిత్తు చిత్తు

సెమీస్‌ చేరువలో మోర్గాన్‌ సేన

ఇంగ్లాండ్‌ ఘనవిజయం

దుబాయ్‌

ఇంగ్లాండ్‌ ఎంత జోరు మీదున్నప్పటికీ.. ఆస్ట్రేలియాతో ఆ జట్టు మ్యాచ్‌ మరీ ఇంత ఏకపక్షం అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఆసీస్‌ను పసికూనలా మార్చేసిన ఇంగ్లిష్‌ జట్టు.. చిత్తు చిత్తుగా ఓడించేసింది. కంగారూలు ఆపసోపాలు పడి చేసిన స్కోరును ఏకంగా 50 బంతులుండగానే ఛేదించేసి ఆ జట్టుకు పరాభవాన్ని మిగిల్చింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇంగ్లాండ్‌ దాదాపు సెమీస్‌ చేరినట్లే.

ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. అటు బౌలింగ్‌లో ఆసీస్‌ను గొప్పగా నియంత్రించిన ఆ జట్టు.. బ్యాటింగ్‌లో చెలరేగి ఆడి విజయాన్ని అందుకుంది. శనివారం మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ ఫించ్‌ (44) టాప్‌ స్కోరర్‌. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోర్డాన్‌ (3/17), వోక్స్‌ (2/23) ప్రత్యర్థిని కట్టడి చేశారు. బట్లర్‌ (71 నాటౌట్‌; 32 బంతుల్లో 5×4, 5×6) చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్‌ 11.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

ఏ మూలకూ సరిపోలేదు: ఛేదనలో ఇంగ్లాండ్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఓపెనర్‌ బట్లర్‌ చెలరేగడంతో ఆ జట్టు స్కోరు బోర్డు పరుగులెత్తింది. జేసన్‌ రాయ్‌ (22; 20 బంతుల్లో 1×4, 1×6) సాయంతో అతడు దొరికిన బంతిని దొరికినట్లు బాదడంతో పవర్‌ ప్లే ఆఖరికి ఇంగ్లాండ్‌ 66/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో స్టార్క్‌ బౌలింగ్‌లో బట్లర్‌ కొట్టిన రెండు భారీ సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్‌. రాయ్‌ వెనుదిరిగినా బట్లర్‌ తగ్గలేదు. దీంతో ఇంగ్లాండ్‌ ఛేదన సాఫీగా సాగిపోయింది. అదే ఊపులో జంపా బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసిన బట్లర్‌.. ఆ తర్వాతా జోరు కొనసాగించాడు. అతడికి తోడు బెయిర్‌స్టో (16 నాటౌట్‌; 11 బంతుల్లో 2×6) ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్‌ 12వ ఓవర్లోనే ఛేదన పూర్తి చేసింది.

ఆస్ట్రేలియా తడబాటు: అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తీవ్రంగా ఇబ్బంది పడింది. వికెట్ల మీద వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిపోయింది. నాలుగు ఓవర్లకు ఆ జట్టు చేసింది కేవలం 15 పరుగులే.. పైగా 3 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన వార్నర్‌ (1)తో పాటు స్మిత్‌ (1), మ్యాక్స్‌వెల్‌ (6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ మూడు వికెట్లలో రెండు వికెట్లు వోక్స్‌ ఖాతాలో చేరాయి. స్మిత్‌ క్యాచ్‌ను కూడా వోక్స్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఈ స్థితిలో ఫించ్‌తో కాసేపు నిలిచిన వేడ్‌ (18) కూడా వెనుదిరగడంతో 12 ఓవర్లకు ఆసీస్‌  51/5తో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. కానీ ఫించ్‌.. అగర్‌ (20) తోడుగా స్కోరు పెంచాడు. వీళ్లిద్దరితో పాటు చివర్లో కమిన్స్‌ (12; 3 బంతుల్లో 2×6), స్టార్క్‌ (13; 6 బంతుల్లో 1×4, 1×6) ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 1; ఫించ్‌ (సి) బెయిర్‌ స్టో (బి) జోర్డాన్‌ 44; స్మిత్‌ (సి) వోక్స్‌ (బి) జోర్డాన్‌ 1; మ్యాక్స్‌వెల్‌ ఎల్బీ (బి) వోక్స్‌ 6; స్టాయినిస్‌ ఎల్బీ (బి) రషీద్‌ 0; వేడ్‌ (సి) రాయ్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 18; అగార్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) మిల్స్‌ 20; కమిన్స్‌ (బి) జోర్డాన్‌ 12; స్టార్క్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 13; జంపా రనౌట్‌ 1; హేజిల్‌వుడ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 125; వికెట్ల పతనం: 1-7, 2-8, 3-15, 4-21, 5-51, 6-98, 7-110, 8-110, 9-119; బౌలింగ్‌: రషీద్‌ 4-0-19-1; వోక్స్‌ 4-0-23-2; జోర్డాన్‌ 4-0-17-3; లివింగ్‌స్టోన్‌ 4-0-15-1; మిల్స్‌ 4-0-45-2

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ ఎల్బీ (బి) జంపా 22; బట్లర్‌ నాటౌట్‌ 71; మలన్‌ (సి) వేడ్‌ (బి) అగార్‌ 8; బెయిర్‌స్టో నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (11.4 ఓవర్లలో 2 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-66, 2-97; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-37-0; హేజిల్‌వుడ్‌ 2-0-18-0; కమిన్స్‌ 1-0-14-0; అగార్‌ 2.4-0-15-1; జంపా 3-0-37-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని