Updated : 29/10/2021 07:17 IST

T20 World Cup: ఆసీస్‌ అదరహో..

శ్రీలంకపై ఘనవిజయం

మెరిసిన వార్నర్‌

రాణించిన జంపా, స్టార్క్‌

దుబాయ్‌

ఆస్ట్రేలియా అదరహో. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. జంపా, స్టార్క్‌, కమిన్స్‌ లంకకు కళ్లెం వేస్తే.. వార్నర్‌ సరైన సమయంలో ఫామ్‌ను అందుకుంటూ చెలరేగిపోయాడు. ఆసీస్‌కు రెండు మ్యాచ్‌ల్లో ఇది రెండో విజయం.

స్ట్రేలియా ఆల్‌రౌండ్‌ సత్తా చాటింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (65; 42 బంతుల్లో 10×4) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో  శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. వార్నర్‌తో పాటు ఫించ్‌ (37; 23 బంతుల్లో 5×4, 2×6) మెరవడంతో 155 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మొదట శ్రీలంక 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. అసలంక (35; 27 బంతుల్లో 4×4, 1×6), కుశాల్‌ పెరీరా (35; 25 బంతుల్లో 4×4, 1×6), భానుక రాజపక్స (33 నాటౌట్‌; 26 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. ఆడమ్‌ జంపా (2/12), స్టార్క్‌ (2/27), కమిన్స్‌ (2/34) లంకేయులకు కళ్లెం వేశారు. జంపా ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు.

అలవోకగా..: శ్రీలంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపని వేళ.. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫించ్‌ ఫోర్‌, సిక్స్‌.. వార్నర్‌ రెండు ఫోర్లు బాదడంతో లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. జోరు కొనసాగించిన ఫించ్‌.. చమీర బౌలింగ్‌లో వరుసగా 6, 4 దంచేశాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా 63/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో ఫించ్‌, జట్టు స్కోరు 80 వద్ద మ్యాక్స్‌వెల్‌ (5) ఔటైనా ఆస్ట్రేలియాకు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన వార్నర్‌.. వీలైనప్పుడల్లా బౌండరీ బాదుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్మిత్‌ (28 నాటౌట్‌; 26 బంతుల్లో 1×4)తో మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అతడు.. 15వ ఓవర్లో ఔటయ్యాడు. అయినా లంక సంతోషించడానికేమీ లేకపోయింది. ఎందుకంటే అప్పటికి ఆసీస్‌ స్కోరు 130. ఆ జట్టు గెలుపు ఖాయమైపోయింది. స్టాయినిస్‌ (16 నాటౌట్‌; 7 బంతుల్లో 2×4, 1×6)తో  కలిసి స్మిత్‌ మిగతా పని పూర్తి చేశాడు. లంక బౌలర్లలో హసరంగ డిసిల్వా (2/22) రాణించాడు.

లంక కట్టడి: టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా అంతకుముందు శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ నిశాంక (7) మూడో ఓవర్లోనే నిష్క్రమించినా లంక ఇన్నింగ్స్‌కు మంచి పునాదే పడింది. చరిత్‌ అసలంక ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. మరో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా సహకరిస్తుండగా ఇన్నింగ్స్‌కు మంచి వేగాన్నిచ్చాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను  బౌండరీ దాటించిన అసలంక.. దూకుడు కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. స్టాయినిస్‌ బౌలింగ్‌లో పెరీరా వరుసగా రెండు బౌండరీలు సాధించాడు. 9 ఓవర్లలో 75/1తో లంక మంచి స్కోరు దిశగా సాగింది. అయితే అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అసలంక ఔట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. చకచకా వికెట్లు కోల్పోయి లంక అనూహ్యంగా దెబ్బతింది. భారీ స్కోరు సరికదా..  కనీస పోటీ ఇవ్వడానికి అవసరమైన స్కోరైనా ఆ జట్టు చేయగలదా అనిపించింది. 16 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆసీస్‌..  మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. 78/1తో ఉన్న శ్రీలంక.. 94/5కు చేరుకుంది. జంపా వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో స్వీప్‌ షాట్‌కు యత్నించిన అసలంక స్మిత్‌కు తేలికైన క్యాచ్‌ వెనుదిరగగా, ఆ తర్వాత పెరీరా, ఫెర్నాండో, హసరంగ క్యూ కట్టారు. ఆ దశలో భానుక రాజపక్స లంకను ఆదుకున్నాడు. చక్కని బ్యాటింగ్‌తో జట్టు స్కోరును 150 దాటించాడు. 17వ ఓవర్లో చెలరేగిన రాజపక్స.. స్టాయినిస్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6 బాదేశాడు. అతడి జోరుతో ఆఖరి నాలుగు ఓవర్లలో లంక ఒక వికెట్‌ కోల్పోయి 43 పరుగులు రాబట్టింది. రాజపక్స.. శనక (12)తో ఆరో వికెట్‌కు 40, కరుణరత్నె (9 నాటౌట్‌)తో అభేద్యమైన ఏడో వికెట్‌కు 20 పరుగులు జోడించాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) వార్నర్‌ (బి) కమిన్స్‌ 7; కుశాల్‌ పెరీరా (బి) స్టార్క్‌ 35; అసలంక (సి) స్మిత్‌ (బి) జంపా 35; అవిష్క ఫెర్నాండో (సి) స్మిత్‌ (బి) జంపా 4; భానుక రాజపక్స నాటౌట్‌ 33; హసరంగ డిసిల్వా (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 4; శనక (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 12; కరుణరత్నె నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154 వికెట్ల పతనం: 1-15, 2-78, 3-86, 4-90, 5-94, 6-134 బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-27-2; హేజిల్‌వుడ్‌ 4-0-26-0; కమిన్స్‌ 4-0-34-2; మ్యాక్స్‌వెల్‌ 1-0-16-0; స్టాయినిస్‌ 3-0-35-0; ఆడమ్‌ జంపా 4-0-12-2

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాజపక్స (బి) శనక 65; ఫించ్‌ (బి) హసరంగ డిసిల్వా 37; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫెర్నాండో (బి) హసరంగ డిసిల్వా 5; స్మిత్‌ నాటౌట్‌ 28; స్టాయినిస్‌ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (17 ఓవర్లలో 3 వికెట్లకు) 155; వికెట్ల పతనం: 1-70, 2-80, 3-130 బౌలింగ్‌: చమిక కరుణరత్నె 2-0-19-0; తీక్షణ 4-0-27-0; చమీర 3-0-33-0; లహిరు కుమార 3-0-48-0; హసరంగ డిసిల్వా 4-0-22-2; శనక 1-0-6-1

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని