IPL 2021: మ్యాక్సీ.. నన్నే ముగించమన్నాడు: కేఎస్‌ భరత్‌

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు విజయాన్ని అందించిడంతో తెలుగు ఆటగాడు కేఎస్‌ భరత్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. 

Updated : 10 Oct 2021 10:30 IST

దుబాయ్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు విజయాన్ని అందించిడంతో తెలుగు ఆటగాడు కేఎస్‌ భరత్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో 52 బంతుల్లో అజేయంగా 78 పరుగులు చేసిన అతను.. చివరి బంతికి తాను సిక్సర్‌ కొట్టేలా సహచర బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌ మాటలు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని తెలిపాడు. ‘‘చివరి ఓవర్‌కు ముందు ఏ విధంగా పరుగులు రాబట్టాలనే విషయం గురించి నేను, మ్యాక్స్‌వెల్‌ మాట్లాడుకున్నాం. బంతిని చూసి బ్యాటింగ్‌ చేయమని అతను చెప్పాడు. చివరి మూడు బంతులుండగా పరుగు తీసి స్ట్రైక్‌ ఇవ్వాలా అని అతణ్ని అడిగా. కానీ ‘నువ్వు మ్యాచ్‌ ముగించగలవు’ అని నాతో అన్నాడు. ఆ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. చివరి బంతికి వైడ్‌ పడటంతో సిక్సర్‌ కొట్టేందుకు అవకాశం వచ్చిందనుకున్నా. అదృష్టవశాత్తూ ఆఖరి బంతి బౌండరీ బయట పడింది. ఆ సిక్సర్‌తో కోహ్లి ఉప్పొంగిపోయాడు. నా దగ్గరకు వచ్చి ‘ఇదో అద్భుతమైన ప్రయత్నం. నువ్వు ఆస్వాదించేందుకు ఓ ప్రత్యేకమైన సందర్భం’ అని చెప్పాడు. కోహ్లి, మ్యాక్సీ, డివిలియర్స్‌ ఆట చూసి ఎంతో నేర్చుకున్నా. ఫాస్ట్‌బౌలింగ్‌ను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతా. భారత్‌- ఎ తరపున ఆడడంతో పాటు సీనియర్‌ జట్టుతో కలిసి సాగడంతో దేశంలోని ఉత్తమ బౌలర్లతో ఆడే అవకాశం దక్కింది. గత రెండు మూడేళ్లుగా నా బ్యాటింగ్‌ దృక్పథాన్ని మార్చుకున్నా. ప్రతి బంతినీ బౌండరీ కొట్టాలనే ఉద్దేశం నుంచి బయటకు వచ్చా. విభిన్న అంశాలపై పట్టు సాధించా. దీంతో ఇప్పుడు ఐపీఎల్‌ లాంటి పెద్ద వేదికలో ఫలితాలు దక్కుతున్నాయి’’ అని శనివారం వర్చువల్‌ మీడియా సమావేశంలో భరత్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని