Ian Chappell: టెస్టు క్రికెట్‌పై నిజమైన విశ్వాసం ఉంటే.. కోహ్లిని ప్రతినిధిగా చేయండి

టెస్టు క్రికెట్‌పై నిజమైన విశ్వాసం ఉంటే.. ఈ ఫార్మాట్‌ను కాపాడాలనుకుంటే

Updated : 16 Aug 2021 11:37 IST

దిల్లీ: టెస్టు క్రికెట్‌పై నిజమైన విశ్వాసం ఉంటే.. ఈ ఫార్మాట్‌ను కాపాడాలనుకుంటే ప్రపంచంలోని టాప్‌ క్రికెటర్లంతా కలిసి ఒక పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలని.. ఇందుకు విరాట్‌ కోహ్లిని ప్రతినిధిగా ఎంచుకోవాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అన్నాడు. ‘‘ప్రస్తుతం ఉన్న స్థితిలో టెస్టు స్థాయిలో రాణించాలంటే యువ ఆటగాళ్లకు ఆరంభంలోనే పునాది పడాలి. వాళ్లు ఈ ఫార్మాట్లో నెమ్మదిగా ఎదగాలి. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి. అప్పుడే టెస్టు క్రికెట్‌ కళకళలాడుతుంది. ఇలా జరగాలంటే ప్రపంచంలోని స్టార్‌ క్రికెటర్లంతా సమావేశం కావాలి. ఇందుకోసం కోహ్లిని తమ ప్రతినిధిగా నియమించుకోవాలి. యువ ఆటగాళ్లకు ఆరంభం నుంచే నైపుణ్యాలపై దృష్టి ఉంటే వారు ఎలాంటి ఫార్మాట్‌కైనా అలవాటు పడతారు. పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలంటే దశాబ్దాలుగా ఒక్కటే మార్గం ఉంది. అదే..

వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం. అయితే ప్రస్తుతం ఉన్న టీ20 యుగంలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. కింద స్థాయి నుంచి నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావట్లేదు. బంతిని ఎంత బలంగా బాదగలరో అంచనా వేయగలుగుతున్నారు కానీ.. కొన్ని స్పెల్స్‌ నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొని నిలబడగలరా అని ఆలోచించట్లేదు. ఇదే సూత్రం ఫీల్డింగ్‌కు కూడా వర్తిస్తుంది. ఫీల్డింగ్‌ చాలా మెరుగైందని అంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా దేశాలు స్లిప్‌ క్యాచింగ్‌లో చాలా బలహీనంగా ఉన్నాయి’’ అని చాపెల్‌ విశ్లేషించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని