Fixing : ఫిక్సింగ్‌.. టేలర్‌కు భద్రత కల్పించాలి.. తప్పులేకపోతే కనికరించాలి: గంభీర్‌

స్పాట్ ఫిక్సింగ్‌ గురించి ఐసీసీకి సమాచారం ఇచ్చిన జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌కు...

Published : 26 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: స్పాట్ ఫిక్సింగ్‌ గురించి ఐసీసీకి ఆలస్యంగానైనా సమాచారం ఇచ్చిన జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌కు భారీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కోసం ఓ భారత వ్యాపారి తనను సంప్రదించడం గురించి ఐసీసీకి ఆలస్యంగా సమాచారమిచ్చినందుకు తనపై నిషేధం పడబోతోందని జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌ ట్విటర్‌ వేదికగా స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై గంభీర్‌ స్పందిస్తూ .. ‘‘స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి ఐసీసీకి ఆలస్యంగా సమాచారం ఇచ్చానని టేలర్‌ చెప్పిన విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఎలాంటి తప్పు జరిగినా వెంటనే స్పందిస్తా. అయితే అవినీతి గురించి వెల్లడించిన వారికి భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఫిక్సింగ్‌కు సంబంధించి ఎలాంటి తప్పూ చేయకపోతే టేలర్‌పై కాస్త దయ చూపించాలని అథారిటీకి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టేలర్‌.. ఐసీసీకి ఇచ్చిన రిపోర్ట్‌లో ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో టేలర్‌ రిపోర్ట్‌పై గంభీర్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ‘‘టేలర్‌ స్టేట్‌మెంట్‌ను చదివేటప్పుడు నిరుత్సాహం, అసహనం, కోపం కలిగాయి. మరొకసారి చదివితే ఎందుకో కోపం రాలేదు. అలానే మళ్లీ చదివా. అప్పటికీ నా ఫీలింగ్‌లో ఎలాంటి మార్పులేదు. మూడోసారి చదివితే నా ఎమోషన్లు అన్నీ మారిపోయాయి. అయితే నేను టేలర్‌కు మద్దతుగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నలుగురు పిల్లల తండ్రి అయిన టేలర్‌ తన కుటుంబం కోసం స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వివరాలను ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిన పరిస్థితుల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నా. టేలర్‌ ఓ క్రీడాకారుడే కానీ భయంకరమైన నేరస్థుడేమీ కాదు. నిషేధిత పదార్థాలను వినియోగిస్తున్నట్లు తీసిన వీడియోను అడ్డం పెట్టుకుని హోటల్‌ గదిలో ఆరుగురు బెదిరించడంతోనే ఇలా చేయాల్సి వచ్చిన టేలర్‌కు మద్దతు ఇచ్చే వారూ ఉన్నారు’’ అని గంభీర్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని