Zaheer-Southee: టిమ్‌ సౌథీ తీసుకున్న నిర్ణయమే సరైంది: జహీర్‌ ఖాన్‌

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నిన్న (బుధవారం) జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో ....

Published : 19 Nov 2021 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నిన్న (బుధవారం) జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే గెలుపు వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 164/6 స్కోరు సాధించింది. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి అతికష్టంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే చేయాల్సిన తరుణంలో కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 17వ ఓవర్‌లో రెండు పరుగులు, 18వ ఓవర్‌లో ఐదు పరుగులు, 19వ ఓవర్‌లో ఆరు పరుగులను మాత్రమే ఇచ్చారు. దీంతో ఆఖరి ఓవర్‌లో భారత్‌ విజయానికి పది పరుగులు అవసరం కాగా.. కివీస్ పార్ట్‌టైమ్‌ బౌలర్‌ డారిల్‌ మిచెల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. వెంకటేశ్‌ అయ్యర్ (4), పంత్‌ (17*) రెండు ఫోర్లను కొట్టడంతో టీమ్‌ఇండియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేయగలిగింది. న్యూజిలాండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో టిమ్‌ సౌథీ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఘనవిజయం సాధిస్తుందేలే అనుకున్న టీమ్‌ఇండియాను సౌథీ తన కెప్టెన్సీతో కాస్త కంగారు పెట్టించాడు. ఈ క్రమంలో టిమ్‌ సౌథీపై భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జహీర్‌ఖాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తన బౌలర్లను చాలా చక్కగా వినియోగించుకున్నాడని కివీస్‌ కెప్టెన్‌ టిమ్‌ సౌథీని జహీర్ ఖాన్ అభినందించాడు. ప్రధాన బౌలర్లను కాదని, కీలకమైన ఆఖరి ఓవర్‌ను పార్ట్‌టైమ్‌ మీడియం పేసర్‌ డారిల్‌ మిచెల్‌కు ఇచ్చిన సౌథీ నిర్ణయం సరైంది కాదని పలువురు భావించినా... జహీర్‌ఖాన్‌ మాత్రం ఆ నిర్ణయాన్ని ప్రశంసించాడు. రెగ్యులర్‌ లెగ్‌ స్పిన్నర్‌ టాడ్‌ ఆస్టల్‌కు ఆఖరి ఓవర్‌ ఉన్నా.. మిచెల్‌ చేతికే బంతినిచ్చాడు. ఎందుకంటే అప్పటికే క్రీజ్‌లో ఎడమచేతివాటం బ్యాటర్లు రిషభ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ ఉన్నారు. ఈ సమయంలో బౌండరీలు వచ్చేస్తాయని సౌథీ భావించి ఉంటాడని జహీర్‌ అంచనా వేశాడు. ‘‘సౌథీ తన టాప్‌ బౌలర్లతో కీలక సమయంలోనే బౌలింగ్‌ చేయించాడు. భారత్‌ టాప్‌ ఆర్డర్‌ బాగా ఆడటంతో ఒక దశలో సునాయాస విజయం సాధిస్తుందేమోనని భావించారు. అయితే గొప్పగా పుంజుకున్న సౌథీ బౌలింగ్‌ దళం మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకు తీసుకురావడంలో విజయవంతమయ్యారు. అందుకే సౌథీ కెప్టెన్సీని అభినందించాల్సిందే’’ అని జహీర్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని