అభిమానులకు కప్పులు కావాలి... ర్యాంకులు కాదు: మంజ్రేకర్‌

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న..

Published : 27 Jan 2022 01:34 IST

బీసీసీఐ నిర్ణయానికి మంజ్రేకర్ మద్దతు

ఇంటర్నెట్ డెస్క్‌: విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు సంజయ్‌ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు. విరాట్‌ను తొలగించి రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ట్రోఫీని నెగ్గలేకపోవడమే కోహ్లీపై వేటుకు కారణమని పేర్కొన్నాడు. అభిమానులు ప్రపంచకప్‌లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని తప్పించి రోహిత్‌కు బాధ్యతలను బీసీసీఐ అప్పగించి ఉంటుందని విశ్లేషించాడు. వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై కోహ్లీ అసంతృప్తిగా ఉండటం సరైందేనా అన్న ప్రశ్నకు మంజ్రేకర్‌ సమాధానం ఇస్తూ.. ‘‘ అభిమానులు ప్రపంచకప్‌ వంటి ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ఇదేదో ర్యాంకులు, సిరీస్‌ల గురించి కాదు. అందుకే కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు’’ అని వివరించాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీని భారత్‌ గెలుచుకోలేకపోయింది.

గత ఐపీఎల్‌ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్‌గా కూడానూ కోహ్లీ దిగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం కొనసాగించి ఉంటే బాగుండేది. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. అందుకే వన్డేలు, టెస్టుల్లో కచ్చితంగా సారథ్య బాధ్యతలను నిర్వర్తించాలని అనుకుని ఉంటాడు. అయితే బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతుండటంతో టెస్టుల్లో నాయకత్వానికి గుడ్‌బై చెప్పేసి ఉండొచ్చు’’ అని విశ్లేషించాడు.

టెస్టు కెప్టెన్‌గా వారిద్దరిలో ఒకరు: స్టీవ్‌ స్మిత్ 

విరాట్ కోహ్లీ స్థానంలో టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు స్టీవ్‌స్మిత్ ఇద్దరి పేర్లను సూచించాడు. వారిద్దరిలో ఒకరైతే సరిగ్గా సరిపోతారని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ ఎవరికైనా సరే విరాట్ స్థానంలో నాయకత్వం అప్పగించవచ్చని తెలిపాడు. ‘‘తొలుత విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు. గత ఆరేడు సంవత్సరాలుగా టీమ్‌ఇండియాను అద్భుతంగా నడిపించాడు. అతడి స్థానంలో కెప్టెన్సీ అప్పగించాలంటే రోహిత్, కేఎల్‌ రాహుల్‌ పేర్లను సూచిస్తా’’ అని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని