T20 World Cup 2022: ఈసారి కూడా ఆ జట్టే ఛాంపియన్‌: భారత మాజీ సెలెక్టర్‌

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌నకు సమయం సమీపిస్తోన్న కొద్దీ ఎవరు గెలుస్తారు..? ఏ ఆటగాడు కీలకంగా మారతాడనే వంటి అంశాలను విశ్లేషించడంలో...

Published : 25 Sep 2022 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌నకు సమయం సమీపిస్తోన్న కొద్దీ ఎవరు గెలుస్తారు..? ఏ ఆటగాడు కీలకంగా మారతాడనే వంటి అంశాలను విశ్లేషించడంలో మాజీ ఆటగాళ్లు బిజీగా మారిపోయారు. అక్టోబర్ 16 నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. అయితే 22 నుంచే కీలక దశ అయిన సూపర్‌-12 మ్యాచ్‌లు జరుగుతాయి. టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న ఆడనుంది. ఈ క్రమంలో గతేడాది అనూహ్యంగా గ్రూప్‌ దశకే పరిమితమైన టీమ్‌ఇండియా ఈసారి మాత్రం ఫేవరేట్‌గా బరిలోకి దిగి కప్‌ నెగ్గాలని పట్టుదలతో ఉంది. అయితే భారత మాజీ సెలెక్టర్ సబా కరీం మాత్రం తన ఫేవరేట్ ఆస్ట్రేలియానేనని చెబుతున్నాడు. ఆసీస్‌ గత టీ20 ప్రపంచకప్‌ విజేత. అందుకే ఈసారి కూడా టైటిల్‌ను ఆసీస్‌ నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సబా కరీం పేర్కొన్నాడు. 

‘‘టీ20 ఫార్మాట్‌లో ఆసీస్‌ బలంగా కనిపిస్తోంది. అందుకే వారినే ఫేవరేట్‌గా పరిగణిస్తా. అంతేకాకుండా ఈసారి టీ20 ప్రపంచకప్‌ జరిగేది వారి సొంతగడ్డపైనే. వారి స్వదేశంలో ఆసీస్‌ను అడ్డుకోవడం చాలా కష్టం. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఆసీస్‌కు స్పష్టత ఉంటుంది. అక్కడన్నీ పెద్ద మైదానాలు. పవర్‌ హిట్టర్స్‌ అవసరం. అలాంటి వారిని తుది జట్టులోకి తీసుకొంటుంది. టిమ్‌ డేవిడ్, మ్యాక్స్‌వెల్‌ మాత్రమే కాకుండా మిచెల్‌ మార్ష్, మార్కస్ స్టొయినిస్‌ హార్డ్‌హిట్టర్లు ఆసీస్‌ సొంతం. ఇలాంటి కాంబినేషన్‌ ఆ జట్టును మరింత బలోపేతంగా మార్చింది. మరోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకొనేందుకు ఆసీస్‌ సిద్ధమవుతోంది’’ అని సబా కరీం వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని