Updated : 29/06/2021 10:16 IST

sports News: క్వార్టర్స్‌లో స్పెయిన్‌ ..రొనాల్డోకు నిరాశే 

సెవిల్లె: యూరో 2020 ఫుట్‌బాల్‌ టోర్నీలో అగ్ర జట్టు స్పెయిన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం రసవత్తరంగా సాగిన సాగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 5-3తో క్రొయేషియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి స్పెయిన్‌ 3-2తో ఆధిక్యంలో నిలవగా.. ఇంజురీ టైంలో మరియో పసాలిక్‌ గోల్‌ (90+2వ నిమిషం) కొట్టి స్కోరు సమం చేశాడు. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి మళ్లింది. స్వల్ప వ్యవధిలో మొరాటా (100వ ని.), ఒయార్జబల్‌ (103 వ ని.) గోల్స్‌ కొట్టి స్పెయిన్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఆధిపత్యాన్ని కొనసాగించిన స్పెయిన్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పోర్చుగల్‌కు షాక్‌ తగిలింది. క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని ఆ జట్టు దూకుడుకు.. ప్రపంచ నంబర్‌వన్‌ బెల్జియం కళ్లెం వేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సోమవారం ప్రి క్వార్టర్స్‌లో బెల్జియం 1-0 తేడాతో ఆ జట్టును ఓడించింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం పోర్చుగల్‌ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరకు ప్రత్యర్థికే విజయం దక్కింది. 42వ నిమిషంలో థోర్గాన్‌ హజార్డ్‌ తన జట్టుకు గెలుపు గోల్‌ అందించాడు. రెండో అర్ధభాగంలో స్కోరు సమం చేసేందుకు పోర్చుగల్‌ గట్టిగానే ప్రయత్నించింది. కానీ బెల్జియం గోల్‌కీపర్‌ గోడలా నిలబడ్డాడు. గోల్‌ చేసేందుకు పోర్చుగల్‌ జట్టు 24 ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కటీ సఫలం కాలేదు. ఈ యూరో కప్‌లో అజేయంగా సాగుతున్న బెల్జియం క్వార్టర్స్‌లో ఇటలీతో తలపడనుంది.

రొనాల్డోకు నిరాశే 

సెవిల్లె: అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఈ సీజన్‌ నిరాశజనకంగా సాగుతోంది. 2016లో తన జట్టును యూరో కప్‌లో విజేతగా నిలిపి.. దేశానికి తొలి ప్రధాన ట్రోఫీని అందించిన అతను.. ఈ సారి ఆ మాయను కొనసాగించలేకపోయాడు. ప్రి క్వార్టర్స్‌లోనే బెల్జియం చేతిలో పోర్చుగల్‌ ఓటమితో తీవ్ర నిరాశ చెందిన 36 ఏళ్ల రొనాల్డో బాధతో మైదానం వీడాడు. ఈ సారి యూరో కప్‌ను అతను గొప్పగానే ఆరంభించాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లోనే అయిదు గోల్స్‌ చేసి.. ఆల్‌టైమ్‌ అంతర్జాతీయ గోల్స్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్‌ మాజీ ఆటగాడు అలీ దేయ్‌ను అతను సమం చేశాడు. బెల్జియంతో మ్యాచ్‌లో అతనొక్క గోల్‌ చేసినా.. సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు జట్టునూ కాపాడేవాడు. గత మ్యాచ్‌ల్లోని తన దూకుడు.. ఈ పోరులో కరవైంది. గోల్‌ చేసే అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేదు. మెరుపు వేగంతో పరుగెత్తి ప్రత్యర్థులను వెనక్కినెట్టే అతను.. ఆ జోరు ప్రదర్శించలేకపోయాడు. ఫ్రీ కిక్‌లనూ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా యూరో కప్‌లో అడుగుపెట్టిన ఆ జట్టు.. టైటిల్‌ నిలబెట్టుకోలేకపోయింది. అంతే కాకుండా అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు అతను ఇంకొంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఏడాది ఉత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడి అవార్డూ తనకు దక్కేలా లేదు. తన క్లబ్బు జువెంచస్, తన జట్టు పోర్చుగల్‌ తరపున అతను ఈ సీజన్‌లో మొత్తం 40కి పైగా గోల్స్‌ చేసినప్పటికీ.. రొనాల్డో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. జువెంచస్‌కు ఇటాలియన్‌ లీగ్‌ (సిరీ- ఎ) టైటిల్‌ అందించకపోవడంతో వచ్చే ఏడాది ఆ క్లబ్బుతో ముగిసే అతని ఒప్పందాన్ని పొడిగిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఏడాది అతను.. ఇటాలియన్‌ కప్, ఇటాలియన్‌ సూపర్‌ కప్‌ టైటిళ్లు మాత్రమే గెలిచాడు.  

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని