ద్రవిడ్‌ సలహాలు పాటిస్తే మేలు : పీటర్సన్‌

శ్రీలంక పర్యటనలో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్‌ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ విలువైన సూచనలు చేశాడు...

Updated : 24 Jan 2021 09:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక పర్యటనలో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్‌ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ విలువైన సూచనలు చేశాడు. తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. ద్రవిడ్‌ చేసిన సాయంతో తన ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పాడు.

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఇంగ్లాండ్‌ జట్టు రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలవగా, రెండో టెస్టులో ఇంగ్లీష్‌ జట్టు పోరాడుతోంది. అయితే, ఆ జట్టు‌ ఓపెనర్లు జాక్‌ క్రాలీ, డొమినిక్‌ సిబ్లీ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం మూడుసార్లు లంక స్పిన్నర్‌ ఎంబుల్డేనియా చేతిలోనే ఔటయ్యారు. దీంతో వారు స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన పీటర్సన్‌.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ రెండు ట్వీట్లు చేశాడు. అందులో ఒకసారి రాహుల్‌ ద్రవిడ్‌ తనకు పంపిన ఈమెయిల్‌ను చదవాలని సూచించాడు. అది తన ఆటను పూర్తిగా మార్చేసిందని పేర్కొన్నాడు. 

ద్రవిడ్‌ పంపిన రెండు పేజీల లేఖను ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌‌ ట్విటర్‌లో పంచుకొని తమ‌ క్రికెట్‌ బోర్డు దాన్ని ప్రింట్‌ తీసి క్రాలీ, సిబ్లీకి అందజేయాలని కోరాడు. అవసరమైతే ఈ విషయంపై మరింత లోతుగా చర్చించేందుకు తనకు ఫోన్‌‌ చేయొచ్చని చెప్పాడు. ఇలాగైనా తమ‌ ఓపెనర్లు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరని పీటర్సన్‌ భావిస్తున్నాడు. ఇదిలా ఉండగా, 2010లో బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో పీటర్సన్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అదే సమయంలో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు.. ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా మాజీ సారథి స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై రెండు పేజీల సుదీర్ఘ లేఖను పీటర్సన్‌కు ఈ-మెయిల్‌ చేశాడు. దాన్నే ఇప్పుడు ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు తమ ఆటగాళ్లతో పంచుకున్నాడు.

ఇవీ చదవండి..
సంజూని కెప్టెన్‌ కాకుండా వైస్‌కెప్టెన్‌ చేయాల్సింది
పంత్‌‌ వచ్చి టీమ్‌ ప్లాన్‌ మొత్తాన్ని మార్చేశాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని