Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు సీఎస్‌కే స్పెషల్‌ జెర్సీ!

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాకు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యేకంగా రూపొందించిన జావెలిన్‌ ఎడిషన్‌ ‘ఎక్స్‌యూవీ 700’ వాహనాన్ని నీరజ్‌ చోప్రాకు పంపించిన విషయం

Published : 01 Nov 2021 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాకు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యేకంగా రూపొందించిన జావెలిన్‌ ఎడిషన్‌ ‘ఎక్స్‌యూవీ 700’ వాహనాన్ని నీరజ్‌ చోప్రాకు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కూడా గతంలో ప్రకటించినట్లుగా రూ.కోటి నగదు బహుమతిని నీరజ్‌కు అందజేసింది. అంతేకాదు.. సీఎస్‌కే స్పెషల్‌ జెర్సీని బహుకరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ జావెలిన్‌ త్రో రికార్డు.. 87.58మీటర్లను సంఖ్యగా మార్చి జెర్సీపై 8758 నంబర్‌ను ముద్రించి ఇచ్చారు. ఈ జెర్సీ, నగదు బహుమతిని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ దిల్లీలో నీరజ్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా నీరజ్‌ మాట్లాడుతూ.. ‘‘స్వర్ణం గెలిచిన తర్వాత నాపై ఇంత ప్రేమ కురుస్తుందని నేను ఊహించలేదు. కానీ.. ఇది ఇంతో సంతోషంగా అనిపిస్తుంది. మీ మద్దతు.. బహుమతులకు ధన్యవాదాలు. గత రెండు నెలలుగా ప్రకటనల షూటింగ్స్‌, క్రీడారంగంలో ప్రముఖుల అభినందనలతో బిజిబిజీగా గడుస్తోంది. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ఇకపై నేను మరింత కష్టపడతాను. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాను’’అని తెలిపాడు. 

దేశం గర్విస్తోంది: విశ్వనాథన్‌

నీరజ్‌కు స్పెషల్‌ జెర్సీని అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. ‘‘నీరజ్‌ చోప్రా సాధించిన విజయం పట్ల యావత్‌ దేశం గర్వపడుతోంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. అలాగే రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ సాధించిన 87.58 రికార్డు భారత క్రీడా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. నీరజ్‌ దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి’’అని విశ్వనాథన్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని