Peng Shuai: పెంగ్‌ క్షేమంగా ఉంది.. త్వరలోనే బయటకొస్తుంది: చైనా మీడియా

చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఆచూకీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..

Published : 20 Nov 2021 23:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఆచూకీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ హు ఐజిన్‌ స్పందించారు. పెంగ్‌ షువాయి క్షేమంగా, స్వేచ్ఛగా ఆమె స్వగృహంలోనే ఉందని వెల్లడించారు. త్వరలోనే పౌర సమాజం ముందుకు వస్తుందని పేర్కొన్నారు. ‘గత కొన్ని రోజులుగా పెంగ్ షూవాయి ప్రశాంతంగా తన ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఎలాంటి డిస్టర్బ్‌కు గురి కావాలని భావించడం లేదు. అందుకే బయటకు రావడం లేదు. త్వరలోనే పబ్లిక్‌ ఎదుటకు వస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది’’అని వివరించారు. పెంగ్‌కు సంబంధించిన ఫొటోలతో కూడిన స్టేట్‌మెంట్‌ను చైనా అధికారిక పత్రిక అయిన పీపుల్స్‌ డైలీలో గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్ ఇన్‌ చీఫ్‌ పేరిట ప్రచురితమైంది. అయితే ఫొటోల ప్రామాణికతను రాయిటర్స్‌ సంస్థ ధ్రువీకరించలేదు. 

చైనా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి జాంగ్‌పై లైంగిక హింస ఆరోపణలు చేసినప్పటి నుంచి (నవంబర్ 2వ తేదీ) పెంగ్‌ షువాయి కనిపించకుండాపోయింది. ఆమె ఆరోపణల మీద ఇటు జాంగ్ కానీ, చైనా ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో క్రీడాకారిణి ఆచూకీ కోసం సాగుతున్న ఉద్యమం ఉద్ధృతమైంది. నిన్న (శుక్రవారం) మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్సన్  కూడా పెంగ్‌ ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఆమె సురక్షితంగానే ఉన్నానని, చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పెంగ్‌ నుంచి వచ్చిన ఈ మెయిల్‌పై మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ఛైర్మన్‌ సైమన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆచూకీ దొరకకపోతే చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకూ వెనకాడబోమని అతను హెచ్చరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని