IND vs SA : ఫీల్డింగ్‌లో మార్పులు చేయాలి.. తెలివిగా దెబ్బకొట్టారు

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఓడిపోవడానికి ఫీల్డింగ్‌ కూడా ఒక కారణమేనని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్ అన్నాడు. మైదానంలో ఫీల్డర్ల కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారని...

Published : 21 Jan 2022 01:47 IST

భారత్‌ x దక్షిణాఫ్రికా తొలి వన్డేపై మాజీల విశ్లేషణ

ఇంటర్నెట్‌ డెస్క్‌ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఓడిపోవడానికి ఫీల్డింగ్‌ కూడా ఒక కారణమేనని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్ అన్నాడు. మైదానంలో ఫీల్డర్ల కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారని.. అందుకే కెప్టెన్ ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘భారత బౌలింగ్ విభాగం పేలవంగా ఏం లేదు. కొన్నిసార్లు బ్యాటర్లకు కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌ నుంచి మెరుగ్గా రాణిస్తున్నాడు. వన్డే సిరీస్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. భారత ఫీల్డింగ్‌ విభాగం కూడా కొంచెం మెరుగవ్వాల్సి ఉంది. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌కు స్లిప్, గల్లీ, గల్లీ పాయింట్‌లో ఫీల్డర్లను ఉంచుతారనుకున్నాను. అశ్విన్‌ బౌలింగ్‌కి లెగ్ స్లిప్‌, షార్ట్‌ లెగ్‌లో ఫీల్డర్లను మోహరించి ఉంటే బాగుండేది. ఫీల్డింగ్‌ కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారు. కాబట్టి, భారత్‌ ఈ విషయంపై దృష్టి సారించాలి’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

చాలా తెలివిగా దెబ్బకొట్టారు: సంజయ్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని బ్యాటింగ్ మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా తెలివిగా ఆడారని, పక్కా ప్రణాళికతో భారత్‌ని దెబ్బతీశారని పేర్కొన్నాడు. ‘భారత్‌ ఒకానొక దశలో 138/1 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (79), మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (51) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లెవరూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో టీమ్ఇండియా 214/8 ఓటమి అంచులకు వెళ్లింది. భారత్‌ అలా కుప్పకూలడం ఆశ్చర్య పరిచింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా తెలివిగా ఆడారు. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసి భారత్‌ని దెబ్బ తీశారు. మార్‌క్రమ్ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేస్తాడనుకున్నాడు. కానీ, ఐదు ఓవర్లు వేసి కీలక వికెట్ పడగొట్టాడు. మరోవైపు కేశవ్‌ మహరాజ్‌ బంతిని టర్న్‌ చేస్తూ కోహ్లీని ఊరించాడు. బౌలర్‌ ఫెలుక్వాయో.. కీపర్‌ డికాక్‌ చక్కటి సమన్వయంతో రిషభ్ పంత్‌ని స్టంపౌట్ చేశారు. అలాగే, శ్రేయస్ అయ్యర్‌, వెంకటేశ్ అయ్యర్‌లను షార్ట్ పిచ్‌ బంతులతో పరీక్షించారు’ అని సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు.

బుమ్రాకే సాధ్యం: డొనాల్డ్‌

టీమ్ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్‌ డొనాల్డ్‌ ప్రశంసలు కురిపించాడు. ‘ఏ ఫార్మాట్‌లోనైనా యార్కర్లు సంధించడం బుమ్రాకే సాధ్యం. టెస్టుల్లో కూడా తన యార్కర్లతో వికెట్లు రాబట్టగలడు. నేనిప్పటి వరకు ఇలాంటి ఆటగాడిని చూడలేదు. బంతిని రిలీజ్‌ చేసే విధానం అద్భుతం. మణికట్టుతో మాయ చేస్తాడు. నా దృష్టిలో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడిగా ఎప్పటికీ మిగిలిపోతాడు’ అని అలెన్‌ డొనాల్డ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని