Sports news: జెంటిల్‌మెన్‌ ఆటలో బ్యాడ్‌బాయ్స్‌!

అలవోకగా రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు.. అల్పబుద్ధితో గతి తప్పుతున్నారు..

Updated : 24 Nov 2021 10:41 IST

మగువ మత్తులో చిత్తవుతున్న క్రికెటర్లు

అలవోకగా రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు.. చిన్నబుద్ధులతో గతి తప్పుతున్నారు... ఆన్‌ఫీల్డ్‌లో హీరోలు.. తలవంపుల చేష్టలతో ఆఫ్‌ఫీల్డ్‌ జీరోలుగా మిగిలిపోతున్నారు... సిక్సర్ల పిడుగులు, యార్కర్‌ వీరులు కాంత దాసులై అభాసుపాలవుతున్నారు... తాజాగా టిమ్‌ పైన్‌ ఓ అమ్మాయికి సెక్ట్సింగ్‌ చేసి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ కోల్పోయిన వివాదం తెలిసిందే... కాలాన్ని కాస్త రివైండ్‌ చేస్తే ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో... మగువ మత్తులో పడి కెరీర్‌కి మరకలంటించుకున్న కొందరు క్రికెటర్ల బాగోతాలు ఇవి..

కెవిన్‌ పీటర్సన్‌


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

దూకుడైన ఆటతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌కి మేటి ఆటగాడితోపాటు, గ్రేట్‌ హ్యూమన్‌ అనే పేరుండేది. అదీ తను నెరిపిన స్కాండల్‌ బయట పడేంతవరకే. వనెస్సా నిమో అనే సూపర్‌మోడల్‌తో పీటర్సన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండేవాడు. ఎక్కడ చెడిందో తెలియదుగానీ ఆ అమ్మాయికి ఉన్నపళంగా బ్రేకప్‌ చెప్పేశాడు. అదీ జస్ట్‌.. ఒక ఫోన్‌ మెసేజ్‌ ద్వారా. దాంతో వనెస్సాకి తిక్క రేగింది. కెవిన్‌ తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బహిర్గతం చేసింది. ‘కెవిన్‌ సెక్స్‌ కోసం అర్రులు చాచే కామపిశాచి. తనకి ఆ ధ్యాస తప్ప మరోటి పట్టదు. ఆడవాళ్లని ఆట బొమ్మలుగానే చూస్తాడు. మనసు గురించి అసలు ఆలోచించడు’ అంటూ స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది. ఆ దెబ్బతో తన పరువు గంగపాలైంది.

షేన్‌ వార్న్‌


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

ఆన్‌ఫీల్డ్‌లో లెజెండ్‌ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నా.. ఆఫ్‌ఫీల్డ్‌లో షేన్‌వార్న్‌కి స్త్రీలోలుడిగా చెప్పలేనంత చెడ్డ పేరుంది. తొమ్మిదిసార్లు సెక్స్‌ స్కాండల్స్‌లో తన పేరు బయటికొచ్చింది. 2000 సంవత్సరంలో తనకు ఫోన్‌ చేసి అశ్లీలంగా మాట్లాడాడని, తన గదికి రమ్మని పిలిచాడని బ్రిటీష్‌ నర్స్‌ డోన్నా రైట్‌ ఆరోపణలు చేసింది. ఫలితం.. ఆసీస్‌ జట్టు వైస్‌ కెప్టెన్సీ కోల్పోయాడు. 2005లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు వార్న్‌ వ్యక్తిత్వం పాతాళానికి పడిపోయింది. లండన్‌లోని ఓ హోటల్‌ రూంలో నగ్నంగా మారి సెక్స్‌ కోసం నా కాళ్లు పట్టుకున్నాడని ఇంగ్లాండ్‌కు చెందిన విద్యార్థిని లారా సేయర్స్‌ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం లేపాయి. ఆపై వార్న్‌ కెరీర్‌కి తీవ్ర అవాంతరాలొచ్చాయి.

క్రిస్‌ గేల్‌


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

యూనివర్స్‌ బాస్‌గా ప్రకటించుకున్న క్రిస్‌ గేల్‌ సైతం రెండుసార్లు వివాదాల్లో ఇరుక్కున్నాడు. పదేళ్ల కిందట బీబీఎల్‌ టోర్నీలో ఓ మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీవీ ప్రెజెంటర్‌ మెల్‌ మెక్‌లాగ్లిన్‌ని ఉద్దేశించి ‘నీ బుగ్గలు ఎరుపెక్కాయి. నాతో డేట్‌కి సిద్ధమా?’ అని లైవ్‌లోనే అడగడం వివాదానికి దారితీసింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆ ప్రెజెంటర్‌ ఫిర్యాదు చేసింది కూడా. దీనిపై విండీస్‌ బోర్డు గేల్‌కి వార్నింగ్‌ ఇచ్చింది. ఇది కాకుండా 2012 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా శ్రీలంకలోని ఒక హోటల్‌ గదిలో ముగ్గురు బ్రిటీష్‌ అమ్మాయిలతో కలిసి ఉండగా మీడియా కంట పడ్డాడు. అప్పట్లో ఆ న్యూస్‌ సంచలనమైంది.

హెర్ష్‌లే గిబ్స్‌


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

ఆస్ట్రేలియాతో వరల్డ్‌రికార్డ్‌ ఛేజింగ్‌ మ్యాచ్‌లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన హెర్ష్‌లే గిబ్స్‌ని ఎవరు మర్చిపోతారు? తనకి దక్షిణాఫ్రికా మేటి క్రికెటర్లలో ఒకడిగా పేరున్నా సొంత ఆటోబయోగ్రఫీ ‘టు ది పాయింట్‌’తో అంతకన్నా పెద్ద చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. ఆ పుస్తకంలో తన విచ్చలవిడి శృంగార కార్యకలాపాల గురించి రాసుకొచ్చి జనంలో పలుచనైపోయాడు. ‘నేను ఈ రోజు సెంచరీ కొట్టబోతున్నానని నాకు తెలుసు. ఈ హోటల్‌లో పని చేసే అమ్మాయే ఆ అరుదైన ఫీట్‌ చేయడానికి స్ఫూర్తి రగిలించింది’ అంటూ తన ఘనకార్యం గురించి చెప్పాడు. ఇలాంటివి ఆ పుస్తకంలో ఎన్నో.

షాహిద్‌ అఫ్రిది


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

క్రికెట్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్లలో ఒకడైన షాహిద్‌ ఆఫ్రిది వ్యక్తిత్వపరంగా అంత గ్రేట్‌ కాదని 2000లో తేలిపోయింది. ఆఫ్రిది అప్పుడు హసన్‌ రజా, అతీఖ్‌ ఉర్‌ జమాన్‌ అనే మరో ఇద్దరు క్రికెటర్లు కరాచీలోని ఓ హోటల్‌ గదిలో అమ్మాయిలతో దొరికిపోయారు. ఆ అతివలు ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి వచ్చారని బుకాయించాడు ఆఫ్రిది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆ సంఘటనపై విచారణ జరిపించి తను చెబుతోంది అబద్ధమని తేల్చింది. జరిమానా విధించడంతోపాటు కెన్యాలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడకుండా ముగ్గురిపై నిషేధం విధించింది కూడానూ.. 

ఆండ్రూ నెల్‌


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

పెళ్లైన విషయం దాచి నాతో రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తున్నాడని లండన్‌కి చెందిన జెలెనా కుల్జియాసోవా మీడియాకెక్కడంతో దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ ఆండ్రూ నెల్‌ పేరు మసకబారిపోయింది. కొద్దిరోజుల తర్వాత మరో ఇద్దరు అమ్మాయిలు సైతం నెల్‌ మాతో సంబంధం పెట్టుకున్నాడని చెప్పడంతో తనని జట్టు నుంచి తప్పించారు. వివాదం పెద్దదవడం, భార్య తనని దూరం పెట్టడంతో నెల్‌ తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయంటూ మానసిక నిపుణుల దగ్గర కౌన్సెలింగ్‌ తీసుకున్నాడు. ఆ రకంగా అతడి కెరీర్‌ ముగిసింది.

స్కాట్‌ కుగ్లీన్‌


(ఫొటో: ఆటగాడి ఇన్‌స్టాగ్రామ్‌)

వెరైటీ యాక్షన్‌తో ఆకట్టుకున్న బౌలర్‌ స్కాట్‌ కుగ్లీన్‌. ఈ న్యూజిలాండ్‌ బౌలర్‌ మతిమాలిన చర్యలతో అర్థాంతరంగా క్రికెట్‌ని వదిలేయాల్సి వచ్చింది. స్కాట్‌ నన్ను రేప్‌ చేశాడంటూ 21ఏళ్ల యువతి 2015లో ఆరోపణలు చేసింది. పోలీసులు విచారణ చేసి స్కాట్‌ను అరెస్ట్‌ చేశారు. అదేసమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ అతడిని వేలంలో కొనుగోలు చేయడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. మరోవైపు కోర్టులో దీనిపై విచారణ జరుగుతుండగానే తను బాధిత అమ్మాయికి ‘నీ పట్ల నేను చేసిన నిర్వాకానికి చింతిస్తున్నా. నన్ను క్షమించు’ అంటూ ఎస్సెమ్మెస్‌ పంపి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన తర్వాత స్కాట్‌కి న్యూజిలాండ్‌ జట్టు నుంచి పిలుపు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని