యువీ, భజ్జీ, సెహ్వాగ్‌ నోరు విప్పాల్సింది..

తమ భవిష్యత్‌పై టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ నోరు విప్పాల్సిందని దిల్లీ క్యాపిటల్స్‌ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డాడు...

Published : 08 Aug 2020 01:08 IST

మళ్లీ టీమ్‌ఇండియాకు ఆడతా: అమిత్‌ మిశ్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ భవిష్యత్‌పై టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ నోరు విప్పాల్సిందని దిల్లీ క్యాపిటల్స్‌ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డాడు. మూడు, నాలుగేళ్ల క్రితమే భారత జట్టుకు దూరమైన ఈ సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఇంకా జాతీయ జట్టుకు ఆడతాననే నమ్మకంతో ఉన్నాడు. తాజాగా క్రికెట్‌.కామ్‌‌తో అతడు మాట్లాడుతూ దిగ్గజ క్రికెటర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వయసును బట్టి ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయొద్దని, జట్టు యాజమాన్యానికి ఏం కావాలో స్పష్టంగా వారితో చర్చించాలన్నాడు. ఒకవేళ వాళ్లు ఫిట్‌నెస్‌గా లేకపోతే నేరుగా ఆ విషయం చెప్పాలని, అలా మాట్లాడితే ఆటగాళ్లెవరూ బాధపడరని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురు క్రికెటర్లూ తమ భవిష్యత్‌పై మాట్లాడాల్సిందని చెప్పుకొచ్చాడు. ఆటపై వాళ్లకున్న ఇష్టం, సామర్థ్యాన్ని సందేహించాల్సిన అవసరం లేదని అమిత్‌ వివరించాడు. అంతకుముందు తన భవిష్యత్‌పై స్పందించిన అతడు.. ఇంకా టీమ్‌ఇండియా పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వన్డేల్లో ఆడాలని ఉందని, అందుకోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఎప్పుడూ ఆ ఆశ అలాగే ఉంటుందని, ఎలాగైనా భారత జట్టుకు మళ్లీ ఆడతాననే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసమే ఇంకా క్రికెట్‌ ఆడుతున్నానని, కేవలం ఐపీఎల్‌ కోసమే కాదని స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియా తరఫున మొత్తం 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడిన అమిత్‌ మిశ్రా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌లు ఆడగా 157 వికెట్లతో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని