T20 World Cup: పాక్‌ మళ్లీ కొట్టింది

టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేని పాకిస్థాన్‌.. టోర్నీలో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఒక్కసారిగా ఫేవరెట్ల రేసులోకి వచ్చిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఓటమి రుచి చూపింది.

Updated : 27 Oct 2021 05:47 IST

వరుసగా రెండో విజయం
అసిఫ్‌, మాలిక్‌ మెరుపులు
రవూఫ్‌ ధాటికి కివీస్‌ విలవిల
షార్జా

టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేని పాకిస్థాన్‌.. టోర్నీలో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఒక్కసారిగా ఫేవరెట్ల రేసులోకి వచ్చిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఓటమి రుచి చూపింది. మరోసారి మొదట బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆ జట్టు.. భారత్‌లో మ్యాచ్‌కు భిన్నంగా ఛేదనలో తడబడ్డప్పటికీ, చివరికి విజయాన్ని సొంతం చేసుకుంది. రవూఫ్‌ బంతితో కివీస్‌ పని పడితే.. మాలిక్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్‌ను గట్టెక్కించాడు. ఇక ఆడాల్సిన మూడు మ్యాచ్‌లూ చిన్న జట్లతోనే కావడంతో పాక్‌ సెమీస్‌ చేరడం లాంఛనమే కావచ్చు.

మకు రెండో సొంతగడ్డ లాంటి యూఏఈలో పాకిస్థాన్‌ చెలరేగుతోంది. మామూలుగా ఛేదనల్లో ఒత్తిడికి గురై మ్యాచ్‌లను చేజార్చుకునే ఆ జట్టు.. ఈ టీ20 ప్రపంచకప్‌లో మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌పై ఘనవిజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో మంగళవారం ఆ జట్టు.. కివీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 135 పరుగుల లక్ష్యాన్ని పాక్‌.. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (33; 34 బంతుల్లో 5×4) మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడగా.. మధ్యలో చకచకా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అసిఫ్‌ అలీ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 1×4, 3×6), షోయబ్‌ మాలిక్‌ (26 నాటౌట్‌; 20 బంతుల్లో 2×4, 1×6) గట్టెక్కించారు. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి  (2/28) రాణించాడు. అంతకుముందు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హారిస్‌ రవూఫ్‌ (4/22) ధాటికి కివీస్‌ 134/8కు పరిమితమైంది.

మధ్యలో మలుపు తిరిగినా..: భారత్‌పై 152 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా అలవోకగా ఛేదించిన పాక్‌కు.. ఈ మ్యాచ్‌లో 136 పరుగుల లక్ష్యం సవాలుగా మారింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 5 ఓవర్లకు పాక్‌.. 28 పరుగులే చేసింది. పైగా తర్వాతి ఓవర్లో బాబర్‌ (9)ను సౌథీ బౌల్డ్‌ చేయడంతో పాక్‌కు కష్టాలు తప్పలేదు. జమాన్‌ (11), హఫీజ్‌ (11) స్పిన్నర్ల బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్‌ బాది కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని చూసినా.. ఆ వెంటనే వికెట్లిచ్చేశారు. హఫీజ్‌ క్యాచ్‌ను కాన్వే లాంగాఫ్‌లో కళ్లు చెదిరే రీతిలో డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. 12వ ఓవర్లో రిజ్వాన్‌ను సోధి వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పాక్‌ను గట్టి దెబ్బ తీశాడు. అప్పటికి స్కోరు 69 పరుగులే. ఇమాద్‌ వసీమ్‌ (11) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. చివరి 4 ఓవర్లలో 37 పరుగులతో సమీకరణం కొంచెం కష్టంగానే కనిపించింది. కానీ బ్యాటింగ్‌లో మాదిరే బౌలింగ్‌లోనూ కివీస్‌ చివరి ఓవర్లలో తడబడింది. 17వ ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో స్లో బంతులకు అసిఫ్‌ అలీ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో పాక్‌ పని తేలికైపోయింది. మాలిక్‌ సైతం సమయోచితంగా షాట్లు ఆడాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌల్ట్‌ బంతిని సిక్సర్‌గా మలిచిన అసిఫ్‌ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

కివీస్‌ కష్టంగా..: భారత్‌లో పోరులో మాదిరే మరోసారి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌.. ఈసారి బంతితో మరింతగా విజృంభించింది. బౌల్ట్‌ మినహాయిస్తే అందరూ బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లే ఉన్న న్యూజిలాండ్‌.. పాక్‌ బౌలర్లను తట్టుకోలేకపోయింది. ఎవ్వరూ కనీసం 30 పరుగులైనా చేయలేకోయారు. గప్తిల్‌ (17), మిచెల్‌ (27), విలియమ్సన్‌ (25), కాన్వే (27) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. క్రీజులో కుదురుకుని ఊపుమీదున్న సమయంలో వెనుదిరిగారు. తర్వాతి బ్యాట్స్‌మెన్‌లో ఎవ్వరూ నిలవలేకపోయారు. షహీన్‌ మెయిడెన్‌ ఓవర్‌తో మొదలైన కివీస్‌ ఇన్నింగ్స్‌.. 5 ఓవర్లకు 36/0తో మెరుగైన స్థితికే చేరుకుంది. కానీ తర్వాతి ఓవర్లో రవూఫ్‌ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని గప్తిల్‌ (17) వెనుదిరగడంతో వికెట్ల పతనం మొదలైంది. అడపా దడపా షాట్లు ఆడుతున్న మిచెల్‌ను ఇమాద్‌ పెవిలియన్‌ చేర్చాడు. నీషమ్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. కాన్వేతో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు కానీ.. స్కోరు వేగం మాత్రం పెరగలేదు. 11 ఓవర్లకు స్కోరు 63/3. తర్వాతి రెండు ఓవర్లలో కేన్‌, కాన్వే ధాటిగా ఆడటంతో 27 పరుగులొచ్చాయి. 13 ఓవర్లకు 90/3తో కివీస్‌ పుంజుకున్నట్లే కనిపించింది. కానీ విలియమ్సన్‌ రనౌటయ్యాక ఆ జట్టు కోలుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. పెద్దగా పరుగులు రాలేదు. రవూఫ్‌ 18వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చి.. కాన్వే, ఫిలిప్స్‌లను ఔట్‌ కివీస్‌ ‘150 స్కోరు’ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరి 7 ఓవర్లలో కేవలం మూడు ఫోర్లు మాత్రమే నమోదు కాగా.. ఈ వ్యవధిలో 5 వికెట్లు పడ్డాయి. వచ్చిన పరుగులు 44 మాత్రమే.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (బి) రవూఫ్‌ 17; మిచెల్‌ (సి) జమాన్‌ (బి) ఇమాద్‌ 27; విలియమ్సన్‌ రనౌట్‌ 25; నీషమ్‌ (సి) జమాన్‌ (బి) హఫీజ్‌ 1; కాన్వే (బి) బాబర్‌ (బి) రవూఫ్‌ 27; ఫిలిప్స్‌ (సి) హసన్‌ (బి) రవూఫ్‌ 13; సీఫర్ట్‌ (సి) హఫీజ్‌ (బి) షహీన్‌ 8; శాంట్నర్‌ (బి) రవూఫ్‌ 6; ఇష్‌ సోధి నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 134 వికెట్ల పతనం: 1-36, 2-54, 3-56, 4-90, 5-116, 6-116, 7-125, 8-134; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 4-1-21-1; ఇమాద్‌ వసీమ్‌ 4-0-24-1; హసన్‌ అలీ 3-0-26-0; రవూఫ్‌ 4-0-22-4; షాదాబ్‌ 3-0-19-0; హఫీజ్‌ 2-0-16-1

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ ఎల్బీ (బి) సోధి 33; బాబర్‌ (బి) సౌథీ 9; జమాన్‌ ఎల్బీ (బి) సోధి 11; హఫీజ్‌ (సి) కాన్వే (బి) శాంట్నర్‌ 11; మాలిక్‌ నాటౌట్‌ 26; ఇమాద్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 11; అసిఫ్‌ అలీ నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 135; వికెట్ల పతనం: 1-28, 2-47, 3-63, 4-69, 5-87 బౌలింగ్‌: శాంట్నర్‌ 4-0-33-1; సౌథీ 4-0-25-1; బౌల్ట్‌ 3.4-0-29-1; నీషమ్‌ 3-0-18-0; ఇష్‌ సోధి 4-0-28-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని