Updated : 08/10/2021 07:33 IST

IPL 2021: కోల్‌‘కథ’ ప్లేఆఫ్స్‌కు

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘనవిజయం

రాణించిన శివమ్‌ మావి, ఫెర్గూసన్‌, గిల్‌

ముంబయి ఆశలు గల్లంతు!

ఇక ఉత్కంఠేమీ లేదు. లీగ్‌ దశ ఆఖరి రోజు ఫలితాలతో సంబంధం లేదు. ప్లేఆఫ్స్‌ చేరే నాలుగో జట్టేదో తేలిపోయింది. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా అదిరే ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో రాజస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ.. దిల్లీ, చెన్నై, బెంగళూరు తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌ సమరానికి సిద్ధమైంది. శుభ్‌మన్‌ గిల్‌ చక్కని ఇన్నింగ్స్‌తో మెరుగైన స్కోరు సాధించిన కోల్‌కతా.. శివమ్‌ మావి, ఫెర్గూసన్‌ల సూపర్‌ బౌలింగ్‌తో రాయల్స్‌ను కుప్పకూల్చింది. ఈ ఫలితంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ కథ ముగిసింది. ఇక శుక్రవారం జరిగే రెండు మ్యాచ్‌లు నామమాత్రమే. ముంబయి సాంకేతికంగా రేసులో ఉన్నా.. ముందంజ వేయడం అసాధ్యం. ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో కోల్‌కతాతో సమమవుతుంది. కానీ కోల్‌కతాకు చాలా మెరుగైన రన్‌రేట్‌ ఉంది. రన్‌రేట్‌లో ఆ జట్టును అధిగమించాలంటే ముంబయి చివరి మ్యాచ్‌లో 171 పరుగుల తేడాతో నెగ్గాలి. అది సాధ్యమయ్యే పని కాదు.

షార్జా

కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కుమ్మేసింది. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు.. గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించి ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (56; 44 బంతుల్లో 4×4, 2×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (38; 35 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో మొదట కోల్‌కతా 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఛేదనలో చతికిలపడ్డ రాజస్థాన్‌ త్వరగానే చేతులెత్తేసింది. శివమ్‌ మావి (4/21), ఫెర్గూసన్‌ (3/18), వరుణ్‌ చక్రవర్తి (1/14) ధాటికి 16.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. తెవాతియా (44) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కోల్‌కతా బౌలింగ్‌ దాడిని ఆరంభించిన షకిబ్‌.. మూడో బంతికే జైశ్వాల్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ పేక మేడను తలపించింది. పతనం ఏ దశలోనూ ఆగలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే పెవిలియన్‌ బాట పట్టారు. ఫెర్గూసన్‌, శివమ్‌ మావి రాజస్థాన్‌ పతనాన్ని శాసించారు. 8 ఓవర్లలో 34/6తో ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. తెవాతియా మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయంతే.

రాణించిన గిల్‌: కోల్‌కతా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఆరంభంలో ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగింది. పరుగులు అంత తేలిగ్గా రాలేదు. వికెట్లేమీ పోకున్నా.. ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ జాగ్రత్తగా ఆడడంతో పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా 34 పరుగులే చేసింది. 9 ఓవర్లకు స్కోరు 55/0. అయ్యర్‌ 28 బంతుల్లో 24, గిల్‌ 26 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఉనద్కత్‌, మోరిస్‌, సకారియా కుట్టదిట్టంగా బౌలింగ్‌ చేశారు. కానీ పదో ఓవర్లో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఉనద్కత్‌ వేసిన ఆ ఓవర్లో అయ్యర్‌ రెండు సిక్స్‌లు బాదగా.. తర్వాత తెవాతియా బౌలింగ్‌లో గిల్‌ ఓ సిక్స్‌ కొట్టాడు. కానీ అదే ఓవర్లో అయ్యర్‌ ఔటయ్యాడు. చకచకా ఫోర్‌, సిక్స్‌ బాదిన నితీష్‌ రాణా (12) కూడా వెంటనే నిష్క్రమించాడు. అయితే రాహుల్‌ త్రిపాఠి (21; 14 బంతుల్లో 3×4), గిల్‌ దూకుడు కొనసాగించారు. 16వ ఓవర్లో గిల్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగేటప్పటికి స్కోరు 133. దినేశ్‌ కార్తీక్‌ (14 నాటౌట్‌), మోర్గాన్‌ (13 నాటౌట్‌) అభేద్యమైన అయిదో వికెట్‌కు 26 పరుగులు జోడించడంతో కోల్‌కతా స్కోరు 171 పరుగులకు చేరుకుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో షార్జాలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. త్రిపాఠి 18వ ఓవర్లో ఔటయ్యాడు.


కోల్‌కతా ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) జైశ్వాల్‌ (బి) మోరిస్‌ 56; వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) తెవాతియా 38; నితీష్‌ రాణా (సి) లివింగ్‌ స్టోన్‌ (బి) ఫిలిప్స్‌ 12; రాహుల్‌ త్రిపాఠి (బి) సకారియా 21; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 14; మోర్గాన్‌ నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171

వికెట్ల పతనం: 1-79, 2-92, 3-133, 4-145

బౌలింగ్‌: ఉనద్కత్‌ 4-0-35-0; మోరిస్‌ 4-0-28-1; సకారియా 4-0-23-1; ముస్తాఫిజుర్‌ 4-0-31-0; శివమ్‌ దూబె 2-0-18-0; తెవాతియా 1-0-11-1; ఫిలిప్స్‌ 1-0-17-1

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైశ్వాల్‌ (బి) షకిబ్‌ 0; లివింగ్‌స్టోన్‌ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్‌ 6; శాంసన్‌ (సి) మోర్గాన్‌ (బి) శివమ్‌ మావి 1; దూబే (బి) శివమ్‌ 18; రావత్‌ ఎల్బీ (బి) ఫెర్గూసన్‌ 0; ఫిలిప్స్‌ (బి) శివమ్‌ మావి 8; తెవాతియా (బి) శివమ్‌ మావి 44; మోరిస్‌ ఎల్బీ (బి) వరుణ్‌ 0; ఉనద్కత్‌ (సి) షకిబ్‌ (బి) ఫెర్గూసన్‌ 6; సకారియా రనౌట్‌ 1; ముస్తాఫిజుర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 85

వికెట్ల పతనం: 1-0, 2-1, 3-12, 4-13, 5-33, 6-34, 7-35, 8-62, 9-85; బౌలింగ్‌: షకిబ్‌ 1-0-1-1; శివమ్‌ మావి 3.1-0-21-4; నరైన్‌ 4-0-30-0; ఫెర్గూసన్‌ 4-0-18-3; వరుణ్‌ చక్రవర్తి 4-0-14-1


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని